వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన అనేక అధికారిక మాఫియా దందాల్లో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పేరు ఎక్కువగా బయటకు వస్తోంది. ఆయన ఎంత సంపాదించుకున్నారో కానీ పూర్తిగా విక్రాంత్ రెడ్డిని జగన్ తరపున ప్రతినిధిగా ముందు పెట్టి వ్యవహారాలు నడిపారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడపోర్టు వ్యవహారంలో కేవీ రావును బెదిరించింది.. పూర్తిగా డీల్ సెట్ చేసింది ఆయనేనని చెబుతున్నారు. అయితే ఆయనను ముందు పెట్టి ఇతరులు డ్రామా ఆడారా లేకపోతే నిజంగానే విక్రాంత్ రెడ్డి ఈ దందా నడిపారా అన్నది తేలాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకూ ఎవరికీ తెలియదు. వైఎస్ సతీమణి విజయలక్ష్మి సోదరిని పెళ్లి చేసుకున్న ఆయన సాదాసీదా వ్యవసాయదారుడే. అయితే వైఎస్ రాజకీయ వైభవం ప్రారంభమయ్యాక ఆయన ఆర్థికంగా బలపడ్డారు. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వైఎస్ చాన్సివ్వలేదు. ఆయన చనిపోయాక వైవీ సుబ్బారెడ్డి దశ తిరిగిపోయింది. అప్పటికే రాజకీయాల్లో ఉన్న బాలినేనిని తొక్కేసి తాను ఎదిగారు. ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి నేరుగా రాజకీయాల్లోకి రాలేదు కానీ జగన్ దగ్గర ఆయనకు కావాల్సిన పనులు చేసి పెడుతున్నారని తేలిపోయింది.
వైవీ సుబ్బారెడ్డి షర్మిలపై తప్పుడు ప్రచారం కూడా చేశారు. ఆస్తుల విషయంలో ఆయన చేసిన ప్రకటనను విజయలక్ష్మి కూడా ఖండించింది. ఇలా చేయడానికి అందరూ రాజకీయాలే కారణం అనుకున్నారు కానీ అంతకు మించిన లావాదేవీలు ఉన్నాయని కాకినాడ పోర్టు కొట్టేయడం వెనుక రాజకీయాలు వెలుగులోకి తెస్తున్నాయి. ఈ విషయంలో విక్రాంత్ రెడ్డి అలాకేసు నమోదు కాగానే ఇలా ముందస్తు బెయిల్ కు వెళ్లారు. పోలీసులు పట్టుకుని మొత్తం బయటకు లాగితే తీగ ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో నే ఇలా చేశాడన్న వాదనలు వినిపిస్తున్నాయి.