వైవీఎస్ చౌదరి అనగానే ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఎందుకంటే అన్నగారికి ఆయన వీరాభిమాని. ఈ విషయాన్ని ప్రతీ వేదికపైనా చెబుతుంటారు. అన్నగారి స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చా అని పదే పదే.. వ్యాఖ్యానిస్తుంటారు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే పూనకాలు తెచ్చుకొనేంత అభిమానం ఆయన సొంతం. నందమూరి హీరోలు బాలకృష్ణ, హరికృష్ణలతో సినిమాలు చేశారు. 40 ఏళ్ల వయసులో హరికృష్ణని హీరోగా చేసిన ఘనత కూడా వైవీఎస్దే. ఇప్పుడు ఆ అభిమానాన్ని మరోసారి చాటుకొన్నారు. ఆయనకు ‘బొమ్మరిల్లు’ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు తన కొత్త బ్యానర్‌కు `ఎన్టీఆర్ ఎట్` అనే పేరు పెట్టారు. న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ అనేది దీని అర్థం. అలా తన సంస్థ పేరులో ఎన్టీఆర్ కనిపించేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొన్నారు. అంతే కాదు.. ఇప్పుడు నందమూరి వారసుల్లో నాలుగోతరం కుర్రాడిని కథానాయకుడిగా తెరంగేట్రం చేయిస్తున్నారు. తన పేరు కూడా ఎన్టీఆర్‌నే. సుదీర్ఘ విరామం తరవాత వైవీఎస్ చౌదరి తీయబోయే సినిమా కోసం నందమూరి జానకీరామ్ తనయుడ్ని హీరోగా ఎంచుకొన్నారు. కథ ఇప్పటికే సిద్ధమైంది. ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో ఓ అచ్చ తెలుగు అమ్మాయిని కథానాయికగా పరిచయం చేయబోతున్నారు. ఆ వివరాలు కూడా త్వరలో చెబుతారు.
* వైవీఎస్ ఏ పార్టీ?
ఎన్టీఆర్ అభిమానులంతా డిఫాల్ట్ గా టీడీపీని అభిమానిస్తారు. వైవీఎస్ కూడా టీడీపీ అభిమానినే. అయితే ఈరోజు హైదరాబాద్ లో జరిగిన వైవీఎస్ చౌదరి ప్రెస్ మీట్లో పార్టీల ప్రస్తావన వచ్చింది. ”మీరు టీడీపీ సపోర్టర్ కదా? కొత్త ప్రభుత్వం నుంచి చిత్రసీమకు ఎలాంటి సపోర్ట్ కోరుకొంటున్నారు” అని పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు. ”నేను ఏ పార్టీనో మీరెలా డిసైడ్ చేస్తారు? అసలు పార్టీకీ, ఈ ప్రెస్ మీట్ కీ సంబంధం ఉందా” అంటూ ప్రశ్నించారు. చిత్రసీమకు చెందిన సమస్యల్ని ఓ దర్శకుడిగా, నిర్మాతగా కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఆ వివరాలేంటో అప్పుడే చెబుతా అంటూ సమాధానం చెప్పకుండా తప్పించుకొన్నారు. దాంతో అసలు ఈయన ఏ పార్టీ? అనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.