పట్టిందల్లా బంగారమనే జాతకం ఇప్పుడు రాజకీయాల్లో ఎవరిదైనా ఉందంటే.. అది ప్రశాంత్ కిషోర్‌దే. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పట్టుకున్న బంగారం.. బొగ్గుగా మారినప్పటికీ.. ఇతర పార్టీలకు వ్యూహకర్తగా మాత్రం బొగ్గును పట్టుకున్నా బంగారం చేస్తున్నారు. అది ఆయన జాతకంలో ఉందో.. నిజంగానే వ్యూహాలతో గెలుస్తున్నారో ఎవరికీ అర్థం కాదు కానీ.. ఆయన ఇప్పుడు… “జడ్ ప్లస్” వ్యూహకర్తగా మారారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సేవలందించిన… పీకే.. అక్కడ ఆ పార్టీ గెలవడంతో.. మరోసారి చర్చల్లోకి వచ్చారు. తాజాగా.. పీకే.. బెంగాల్లో మమతా బెనర్జీతో కలిసి పని చేస్తున్నారు. ఇప్పటికే ఆయన టీం బెంగాల్లో పని ప్రారంభించింది. ఏపీలో.. జగన్మోహన్ రెడ్డి పార్టీకి అమలు చేసిన కొన్ని రకాల వ్యూహాలు.. అంటే కాల్ సెంటర్లను పెట్టడం.. వైఎస్ఆర్ కుటుంబం అనే మిస్డ్ కాల్స్ ఉద్యమం చేపట్టడం లాంటివి.. అక్కడ ప్రారంభించారు.
ఇప్పుడు ఢిల్లీ పని పూర్తి కావడం… బీహార్ రాజకీయాల నుంచి జేడీయూ బయటకు గెంటేయడంతో.. ఆయన మళ్లీ తన పూర్తి స్థాయి వ్యూహకర్త పనిని చేసుకుంటున్నారు. ఇప్పుడు బెంగాల్లోనే ఆయన మకాం. దీదీ కోసం.. పూర్తి స్థాయిలో పని చేస్తున్నారు. ఆయన వ్యూహాలపై గురి ఉందేమో కానీ.. ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చి కాపాడుకోవాలని.. దీదీ నిర్ణయించుకున్నారు. ఆయనకు.. ఆ హోదా కల్పించేశారు. అంటే… ప్రశాంత్ కిషోర్‌కు కాన్వాయ్.. ట్రాఫిక్ క్లియరింగ్ … సెక్యూరిటీ అన్నీ.. ఆ రేంజ్లో ఉంటాయన్నమట. గత పార్లమెంట్ ఎన్నికలలో మమతా బెనర్జీ బెంగాల్లో బీజేపీ నుంచి సెగ ఎదుర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకుండా.. పీకేని నమ్ముకున్నారు.
పీకే సేవలు పొందాలనుకునేవారి సంఖ్య తక్కువేమీ లేదు. బెంగాల్ ఎన్నికలతో పాటు.. తమిళనాడులో డీఎంకేతో కలిసి పని చేసేందుకు.. పీకే కు ఆఫర్ అందినట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ మేరకు ఒప్పందాలు జరిగాయంటున్నారు. మరో వైపు పళని స్వామి, రజనీకాంత్ కూడా .. పీకే సేవలం కోసం ప్రయత్నిస్తున్నారంటున్నారు. అయితే.. పీకే తన సర్వే తాను చేసుకుని.. ఎవరు గెలిచే అవకాశం ఉంటే.. వారి తరపున పని చేస్తారని.. చివరికి క్రెడిట్ కొట్టేస్తారని.. ఆయనంటే పడని ఇతర వ్యూహకర్తలు విమర్శిస్తూ ఉంటారు.