మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో విశాఖలోని శారదాపీఠం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇటీవలి కాలంలో ఆ పీఠానికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. అటు వైపు వెళ్తే పోలీసులు అందర్నీ సోదాలు చేస్తున్నారు. ఇక శారదాపీఠంలోకి ఎవరిని పడితే వారిని వెళ్లనీయడం లేదు. ముందస్తు అనుమతి ఉన్న వారికే పర్మిషన్. నిజానికి శారదాపీఠంలో ఆలయాలు ఉన్నాయి. సమీపంలో ఉన్న కాలనీలు, గ్రామాల ప్రజలు ఆ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడా చాన్స్ లేదు. ఎందుకింత సెక్యూరిటీ పెట్టారన్నదానిపై ఇప్పటికే విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ప్రస్తుతం.. శారదాపీఠంలోకి వైసీపీ నేతలు మాత్రమే స్వేచ్చగా రాకపోకలు సాగిస్తున్నారు.
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూండటంతో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు విశాఖలో మకాం వేశారు. వారందరూ ఏదో సమయంలో రోజూ శారదా పీఠానికి వచ్చి వెళ్తున్నారు. దీంతో అక్కడ ఏదో గూడుపుఠాణి జరుగుతోందన్న అనుమానాన్ని ఇతర పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు అయ్యే వరకూ శారదాపీఠాన్ని మూసేయాలంటూ.. కొంత మంది ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. స్వరూపానంద ఆశ్రమం వైసీపీ పార్టీ అడ్డాగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంగా భద్రత ఏర్పాటు చేశారని మొదట్లో అనుకున్నారు. కానీ… సీఎం పర్యటించి.. వెళ్లిపోయి రోజులు గడుస్తున్నా సెక్యూరిటీ కొనసాగుతోంది. అదే అనుమానాలకు కారణం అవుతోంది.
ఇప్పుడు… ఆ ఆశ్రమంపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలు… రేపు అక్కడ డబ్బులు దాచి పెట్టారని.. గ్రేటర్ ఎన్నికల్లో పంచడానికి అక్కడ్నుంచే తెస్తారని ఆరోపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. అధ్యాత్మిక మఠంపై అలాంటి మరకలు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్వరూపానందపైనే ఉంటుంది. లేకపోతే.. ప్రజల్లో అనుమానాలు పెరిగిపోతాయి.