ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. అధికారంలో ఉన్న జేడీయు, ప్రతిపక్షంలో ఉన్న ఆర్.జె.డి.తో సహా మరో నాలుగు పార్టీలు కలిసి జనతా పరివార్ కూటమిని ఏర్పాటు చేసుకొన్నాయి. వాటితో కాంగ్రెస్ పార్టీ కూడా జత కట్టింది. ఇంతవరకు విడివిడిగా పోటీ చేస్తున్న వామ పక్షాలు కూడా కూటమిగా ఏర్పడ్డాయి. ఈసారి ములాయం సింగ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లీస్ పార్టీ ఎన్నికల బరిలో ఉన్నాయి. వీటన్నిటినీ బీజేపీ ఒంటరిగా ఎదుర్కోబోతోంది.
ఇదివరకు ఈ పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేసినప్పుడు ఓట్లు వాటి మధ్య చీలిపోయేవి. కానీ ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి కూటములు ఏర్పాటు చేసుకొన్నప్పటికీ అదే పరిస్థితి నెలకొని ఉంది. కనుక ఆ కూటములు, పార్టీల మధ్య ఓట్లు చేలిపోయే అవకాశం ఉంది.కానీ జీ న్యూస్ ఛానల్ వారు ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో ఎన్డీయే కూటమికి 140, కాంగ్రెస్+జనతా పరివార్ కలిపి 70 సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది. ఎన్డీయే కూటమికి 50.8 శాతం ఓట్లు, జనతా పరివార్ కి 42.5 శాతం ఓట్లు పోల్ అవుతాయని తెలియజేసింది. కానీ సమాజ్ వాదీ పార్టీ, మజ్లీస్ పార్టీలు ఎవరివైపయినా మ్రోగ్గినట్లయితే మళ్ళీ ఈ అంచనాలు మారిపోవచ్చును.