ఈ నెల 12 నుండి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఐదు దశలలో జరుగుతాయి. ఈసారి పోటీ ప్రధానంగా ఎన్డీయే, జనతా పరివార్ కూటమి మధ్యే ఉంటుందని ఇప్పటికే స్పష్టమయింది. కానీ ఆర్ రెండు కూటములలో ఏది విజయం సాధించి అధికారంలోకి రాబోతోంది? అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. జీ న్యూస్ నిర్వహించిన తాజా సర్వేలో ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీతో బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నట్లు పేర్కొంది. ఆ సర్వే ప్రకారం మొత్తం 243 సీట్లలో ఎన్డీయే కూటమికి 147 సీట్లు, జనతా పరివార్ కూటమికి 64, ఇతరులు 32 సీట్లు గెలుచుకొనే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమయిన సభ్యుల సంఖ్య 117. కానీ ఎన్డీయే కూటమికి ఏకంగా 147 సీట్లు వస్తాయని జీ న్యూస్ సర్వే చెపుతోంది. ఎన్డీయే కూటమికి 53.8 శాతం, 40.2 శాతం ఓట్లు పోలవవచ్చని సర్వేలో తేలింది.
ఒకవేళ ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి విజయం సాధించి అధికారలోకి వచ్చినట్లయితే కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ, ఉపేంద్ర కుశాహ్వా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడవచ్చును. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని జనతా పరివార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందే ప్రకటించి ఎన్నికలకి వెళ్ళింది. జీ న్యూస్ ప్రకటించిన ఈ సర్వే ఫలితాలు ప్రజా తీర్పుకి అద్దం పట్టాయా లేదా అనే సంగతి నవంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది. కానీ ఇటువంటి సర్వేలపై ఎన్నికల సంఘం ఎన్నికలు ముగిసేవరకు నిషేధం విధించినా సరిగ్గా ఐదు రోజుల్లో మొదటి దశ ఎన్నికలు జరిగే ముందు జీ న్యూస్ ఈవిధంగా సర్వే ఫలితాలు ప్రకటించడం చాలా ఆశ్చర్యం, అనుమానం కలిగిస్తోంది.