హైదరాబాద్: ఐదేళ్ళ క్రితం వచ్చిన ‘జిందగీ న మిలేగీ దుబారా’ చిత్రానికి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రౌండ్స్ కొడుతోంది. ఈ చిత్రంలో నటించిన ప్రధాన తారాగణం హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్, కత్రినా కైఫ్, కల్కి కొచ్లిన్ అందరూ ఇప్పుడు సింగిల్‌గా మారిపోయారు. తాజాగా ఫర్హాన్ అక్తర్ 15 సంవత్సరాలుగా తన భార్యగా ఉన్న అధూనాతో బ్రేక్ అప్ అవటంతో మొత్తం తారాగణమంతా బ్రేక్ అప్ అయినట్లయింది. హృతిక్ రోషన్ తన భార్య సుజానేకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. అటు కత్రినా కైఫ్‌కు, రణబీర్ కపూర్‌కు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు మీడియాలో వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. అభయ్ డియోల్ తన గాళ్ ఫ్రెండ్ ప్రీతి దేశాయ్‌తో గత ఏడాది బ్రేక్ అప్ అయ్యారు. కల్కి కొచ్లిన, అనురాగ్ కశ్యప్ గత ఏడాది మే నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన 42 ఏళ్ళ జోయా అక్తర్‌కు మాత్రం ఈ గండం ఏర్పడలేదు. ఎందుకంటే ఆమెకు ఇప్పటివరకు సింగిలే.