తెలుగు360 రేటింగ్ : 2.75/5
కోడి కూర ఎలాగైనా చేయొచ్చు.
అందులో గోంగూర వేస్తే ఓ టేస్టు.
మామిడి టెంక పడేస్తే మరో రుచి.
కథలూ అంతే. ఏ జోనర్ పట్టుకున్నా… దాంట్లో ఎలాంటి అదనపు హంగులు జోడించాం అనే దాన్ని బట్టి రుచులు మారిపోతూ ఉంటాయి. జాంబీ జోనర్ తెలుగుకి కొత్త గానీ, రెగ్యులర్ గా బాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు కాదు. అదెప్పుడో చూసేశారు. కానీ జాంబీ అనగానే ఒళ్లు జలదరించే విషయాలే కనిపిస్తాయి. దానికి సైడ్ డిష్‌గా… వినోదం జోడిస్తే అది `జాంబీ రెడ్డి` అయిపోతుంది. మరి తెలుగుకి బొత్తిగా పరిచయం లేని జాంబీ కథలో… వినోదాన్ని ఎలా జోడించారు? రెండింటి కలయిక కుదిరిందా? లేదా?
మారియో (తేజ) హైదరాబాద్ లో వీడియో గేమర్. అనుకోకుండా కర్నూలు రావాల్సివస్తుంది. అది కూడా.. వీడియో గేమ్ కోసమే. తన స్నేహితులతో కలిసి రూపొందించిన ఓ గేమ్ లో బగ్స్ ఏర్పడతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి కర్నూలు రావాల్సివస్తుంది. అక్కడ తన స్నేహితుడి పెళ్లి జరుగుతుంటుంది. అయితే.. సీమ పగలూ – ప్రతీకారాల మధ్య తన స్నేహితుడు నలిగిపోతున్నాడనిపిస్తుంది తేజకి. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తాడు. మరోవైపు… కరోనాకి వాక్సిన్ కనుక్కునే ప్రయత్నంలో… ఓ సైంటిస్ట్ చేసిన వికృత ప్రయోగాల వల్ల… ఆ ఊర్లో మనుషుల్ని పీక్కుతినే మృగాళ్లంటి వాళ్లు బయల్దేరతారు. ఒకడు… ఇద్దరై, ఇద్దరు పది మందై… మొత్తం ఆ ఊరు ఊరంతా జాంబీల మయం అయిపోతుంది. వాళ్ల నుంచి తనని తాను కాపాడుకుంటూ, తన స్నేహితుల్ని హీరో ఎలా రక్షించాడన్నదే కథ.
మనుషుల్ని పీక్కుతినే మనుషులు అనగానే ఒళ్లు గగుర్పాటుకి గురవుతుంది. జాంబీ సినిమాలు అన్ని వర్గాల వారికీ ఎక్కకపోవడానికి కారణం ఆ లక్షణమే. `జాంబీ రెడ్డి`లోనూ అది కనిపిస్తుంది. కాకపోతే…దర్శకుడు తెలివిగా… దానికి వినోదం, ఫ్యాక్షన్ అనే రెండు అంశాల్ని పేర్చుకుంటూ పోయాడు. జాంబీలు ఓ వైపు గుబేలెత్తిస్తున్నా – మరో వైపు టైమ్ పాస్ వేషాలు.. వర్కవుట్ అయిపోతుంటాయి. ముఖ్యంగా `కసిరెడ్డి`గా జబర్దస్త్ శ్రీను చేసే హడావుడి, రెండు చేతులూ పోగొట్టుకున్న 30 ఇయర్స్ ఫృథ్వీ ఎపిసోడ్, శోభనం సీనులో తన భార్య జాంబీగా మారిందని తెలీయకుండా.. తెగ హైరానా పడిపోతున్న మిర్చీ హేమంత్ అమాయకత్వం.. వినోదాన్ని పంచుతుంటాయి. దాంతో.. ఆయా సన్నివేశాల్ని సైతం.. లైట్ గా తీసుకునే లా చేశాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలెంట్ `అ`తోనే అర్థమైపోయింది. తన తెలివి తేటలు ఈ సినిమాలోనూ… కనిపిస్తుంటాయి.
పావురం కోనేటిలో పడిపోయే షాట్ తో ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఈ కథకి ప్రాణం కూడా… అదే షాట్ లో ఉన్న సంగతి క్లైమాక్స్ వరకూ అర్థం కాదు. జాంబీల విరుగుడు కనుక్కున్న హీరో… శంఖం ఊదడం, ఊరు ఊరంతా.. ఉరుకులు పరుగులతో గుళ్లోకి రావడం – ఇలాంటి షాట్స్, చిన్న చిన్న విషయాల్లో దర్శకుడు పెట్టిన శ్రద్ధ… `జాంబీ రెడ్డి`కి ప్రధాన ఆయుధాలుగా మారిపోయాయి. క్లైమాక్స్‌లో కూడా..అంతే. అప్పటి వరకూ.. జాంబీల్ని చూసి హోరెత్తిపోయిన మైండ్ కి రిలాక్సేషన్ కోసం, చిన్న ఫన్ జోడించి బయటకు పంపాడు. కరోనాతో మొదలైన కథ ఎక్కడికో వెళ్లిపోతోందేంటి? అనుకుంటే – మళ్లీ జాంబీల రాకకి కూడా కారణం కరోనా అని చెప్పి కథకి లింక్ సరిగా ఉండేలా చూసుకున్నాడు. హీరో పాత్ర విషయంలోనూ ప్రశాంత్ వర్మ జాగ్రత్తలు తీసుకున్నాడు. తనని మరీ… అరి వీర భయంకరుడిగా చూపించలేదు. రెండో సినిమా చేస్తున్న తేజకి అలాంటి బిల్డప్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది. జాంబీల్ని అంతు చూసే శక్తి దేవుడికే ఉందన్నట్టు… చూపించి – మంచి పని చేశాడు. హీరో, హీరోయిన్ల వెంట జాంబీలు పడే సన్నివేశం.. దాదాపు 15 నిమిషాల పాటు సాగుతుంది. ఆ సన్నివేశం కోసం దర్శకుడు చాలా కష్టపడి ఉంటాడు. త్రిసూలంతో నాయిక, గదతో.. హీరో, గన్ తో హీరో స్నేహితురాలు.. చేసే యాక్షన్ విన్యాసాలు కూడా బాగుంటాయి. కాకపోతే.. మనుషుల్ని పీక్కుతినే జాంబీ సీన్లు.. చూడాలంటే… గుండెని కాస్త రాయి చేసుకోవాల్సిందే.
బాల నటుడిగా సుపరిచితుడైన తేజ కి ఇది హీరోగా తొలి సినిమా. అయితే ఇంకా పసి తనపు ఛాయలు కనిపిస్తున్నాయి. తన పని తాను నీట్ టా చేశాడు. హీరోయిజం పండించడానికి కావల్సినంత సరంజామా ఈ కథలో వుంది. అయితే దాన్ని ఎంత వరకూ వాడుకోవాలో, అంత వరకే వాడుకుంటూ… ఆ పాత్రని హైలెట్ చేశాడు. ఆనంది అందంగా కనిపించింది. ఆ పాత్రకు ఓ ట్విస్ట్ పెట్టి, దానికీ ప్రాధాన్యం ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. మిర్చీ సంపత్, హర్షవర్థన్, గెటప్ శ్రీను… వీళ్ల పాత్రలూ నచ్చుతాయి.
దర్శకుడు స్క్రిప్టుని బాగానే రాసుకున్నాడు. తన విజువలైజేషన్ కూడా బాగుంది. అందుకు తోడు.. కెమెరా, నేపథ్య సంగీతాలు బలంగా నిలిచాయి. ఆర్.ఆర్.. అయితే కొన్ని చోట్ల సన్నివేశాన్ని బాగా ఎలివేట్ చేయడానికి దోహదం చేసింది. `గో కరోనా… గోగో` పాటలో.. కరోనాతో పుట్టిన వినోదాల్ని, అప్పుడు చేసిన తమాషాల్నీ మరోసారి గుర్తు చేశారు. మిగిలిన పాటలన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో హెల్ప్ అయ్యాయి. పాపులర్ డైలాగ్ `ఐపాయే`ని సైతం ఆర్.ఆర్‌లో.. వాడుకున్నాడు. సమయానుకూలంగా.
తెలుగు సినిమాకి జాంబీ జోనర్ కొత్త. జాంబీ చూసినవాళ్లకి సైతం ఆ జోనర్ లో వినోడం జోడించడం చూడడం కొత్త. కాబట్టి.. ఇదో కొత్త ప్రయత్నంగా మిగిలిపోతుంది. సరదాగా జాంబీ రెడ్డిని కలవడానికి వెళ్తే.. టైమ్ పాస్ కి మాత్రం ఢోకా ఉండదు.
తెలుగు360 రేటింగ్ : 2.75/5