హైదరాబాద్: ఫేస్బుక్ సంస్థ అధినేత మార్క్ జూకర్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫేస్బుక్ సంస్థలో తనకున్న షేర్లలో 99 శాతాన్ని ఒక మంచి ప్రయోజనానికి ఇచ్చేస్తామని ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచారు. తమ మొట్టమొదటి బిడ్డ మ్యాక్స్ పుట్టిన సందర్భంగా జూకర్బర్గ్, ఆయన భార్య చాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాక్స్ పెరగబోతున్న ఈ ప్రపంచం ఒక మెరుగైన ప్రదేశంగా ఉండాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్స్‌కు రాసుకున్న ఒక లేఖలో జూకర్బర్గ్ పేర్కొన్నారు. ఈ లేఖను ఆయన నిన్న తన ఫేస్బుక్ పేజిమీద పోస్ట్ చేశారు. 45 బిలియన్ డాలర్ల విలువ చేసే ఈ 99% షేర్లను చాన్ జూకర్బర్గ్ ఇనిషియేటివ్ అనే తమ సొంత సంఘసేవసంస్థకు ఇచ్చారు. ఈ షేర్లను ఇచ్చేసినా కూడా జూకర్బర్గ్ వద్ద ఇంకా వందల మిలియన్ డాలర్లు ఉంటాయి.
మ్యాక్స్ గతవారం పుట్టినప్పటికీ ఆమె పుట్టిన సమాచారాన్ని నిన్నే బయటపెట్టారు. మానవ సామర్థ్యాన్ని పెంపొందించటం, తర్వాతి తరంలో పిల్లలందరిలో సమానత్వాన్ని ప్రోత్సహించటం చాన్ జూకర్బర్గ్ ఇనిషియేటివ్ లక్ష్యమని జూకర్బర్గ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత బోధన, వ్యాధులకు చికిత్స, ప్రజలను కలపటం, బలమైన కమ్యూనిటీలను నిర్మించటం అంశాలపై చాన్ జూకర్బర్గ్ ఇనిషియేటివ్ మొదట దృష్టి పెడుతుందని తెలిపారు. మరోవైపు జూకర్బర్గ్ చర్యను ప్రఖ్యాత స్టాక్ మార్కెట్ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ అభినందించారు. 31 ఏళ్ళ జూకర్బర్గ్ గతంలోకూడా ఎన్నో సంఘసేవాసంస్థలకు దానధర్మాలు చేశారు. ఫేస్బుక్ సీఈఓగా ఆయన కేవలం ఒక్క డాలర్‌ను సంవత్సర జీతంగా తీసుకుంటుంటారు. జూకర్బర్గ్ భార్య చాన్ చైనీస్-వియత్నమీస్ శరణార్థులకు పుట్టిన అమ్మాయి. వీరిద్దరూ 2003 నుంచి డేటింగ్ చేసుకుంటూ 2012లో పెళ్ళి చేసుకున్నారు.