ఇందిరాగాంధీ, ఎన్ టి రామారావు, వాజ్ పాయ్ లు కలలుగన్న నదీ అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ నుంచి గోదావరి జలాలు పైపులద్వారా, పోలవరం ప్రాజెక్టు కుడికాల్వ ద్వారా, విజయవాడధర్మల్ పవర్ స్టేషన్ రివర్స్ కెనాల్ ద్వారా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలిసే సందర్భాన్ని ముఖ్యమంత్రి ఒక పండుగగా మార్చేశారు. నీటిసరఫరా మార్గమైన భారీ పైప్ లైన్ లో అనేక సార్లు స్వయంగా దిగి, నడచి ఈ ప్రాజెక్టుపై తన ఆసక్తిని ముఖ్యమంత్రి వెల్లడించుకున్నారు. అయితే పట్టిసీమ ఎత్తిపోతల పధకంలో లొసుగులు, లోపాలు, విమర్శలు, రైతు ఆగ్రహాలు ప్రభుత్వ ప్రచార ఆర్భాటం ముందు కనిపించకుండా పోయాయి.
కృష్ణా డెల్టా స్థిరీకరణతోపాటు రాయలసీమకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని1300 కోట్లతో నిర్మించాలని నిశ్చయించి ఈ ఏడాది మార్చి 29న శంకుస్థాపన చేశారు. ఏడాదిలో పథకాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకు 24 మోటారు పంపులు ఏర్పాటు చేయాలి.. ఈ పధకానికి 24 పంపులతో నీరుతోడవలసి వుండగా పంపుల అందుబాటులో లేక ప్రస్తుతానికి 8 పంపులైనా అమర్చాలని ముఖ్యమంత్రి సూచించారు.పనిలోకి దిగేసరికి వెంటనే 4 పంపులైతే ఇవ్వగలమని సప్లయర్లు చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు 4 మోటార్లకు సంబంధించి పనులు పూర్తి చేయాలని సంకల్పించి, 600 మందితో మూడు షిఫ్టులు 24 గంటలూ పనులు నిర్వహించారు. తీరా ప్రారంభోత్సవ సమయానికి ఒకే పంపు వచ్చింది దాన్నే బిగించగలిగారు. దీంతో పట్టిసీమ నుంచి విడుదల కావలసిన 8500 క్యూసెక్కుల నీటికి కేవలం 356 క్యూసెక్కులే విడుదల అవుతోంది
ఈ జాప్యాన్ని ముందే గుర్తించిన ఉన్నతాధికారులు తాడిపూడి పధకం నీటినే ప్రస్తుతానికి కృష్ణలో కలపవచ్చని సూచించారు. ఆప్రకారమే ప్రతిరోజూ ఎంతోకొంత ‘తాడిపూడి’ నీటిని గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద నిర్మించిన తూముల ద్వారా పోలవరం కుడికాలువకు మళ్లిస్తూనే ఉన్నారు. పట్టిసీమ పేరుతో తాడిపూడి నీటికి కృష్ణాకు తరలించడంపై ఇప్పటికే అన్నివైపుల నుంచి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.
పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ 174 కిలోమీటర్లు పొడవుండగా అందులో 29.25 కిలోమీటర్ల పొడవు కాలువ నిర్మాణం పనులు కోర్టులో కేసులు ఉండటం వల్ల నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చొరవా, జోక్యాలవల్ల కోర్టు సమస్యలన్నీ పరిష్కరించి సుమారు 700 కోట్ల రూపాయల పరిహారాన్ని రైతులకు చెల్లించారు. కుడి కాలువ పనులు పూర్తిస్థాయిలో కాకుండా తాత్కాలికంగా పూర్తి చేశారు. సీజను పూర్తయిన తరువాత కాలువ వెడల్పుతోపాటు లైనింగ్ పనులు, కాలువ అడుగు భాగంలో కాంక్రీట్ పనులు చేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే పంపింగ్ స్కీమ్‌కు సంబంధించి విద్యుత్ లైను పనులు కూడా సగ్గొండ సబ్‌స్టేషన్ నుండి తాత్కాలిక లైను ఏర్పాటుచేసి 8 ఎంబివి ట్రాన్స్ఫార్మర్లు రెండు ఏర్పాటు చేశారు.
ఇంతాచేసి ఇంకో ఇరవైరోజుల తరువాత ఈ ఒక్కపంపైనా నీరుతోడే అవకాశమే లేదు. గోదావరి నీటి మట్టం పడిపోతూండటంతో ఈ సీజనుకి నీరుచాలదు. ఇది కృష్ణాడెల్టాను స్ధిరీకరించదు. రాయలసీమకు సాగుజలాలు అందించే సమస్యేలేదు. పైగా పశ్చిమగోదావరి జిల్లాలో మెట్టప్రాంతాల కోసం నిర్మించిన తాటిపూడి ప్రాజెక్టు నీరును ఎవరికో ఇచ్చేసి పండగచేసుకోమంటాడేంటి ఈయన గారు అని పశ్చిమగోదావరి జిల్లారైతులు మండిపడుతున్నారు. మరో పార్టీకి చోటులేకుండా తెలుగుదేశాన్నే గెలిపించిన ఈ జిల్లా రుణం తీర్చుకోలేనని పదేపదే చెప్పే చంద్రబాబు ఈ జిల్లా నీళ్ళు తరలించేసి భలే రుణం తీర్చుకున్నాడని విమర్శిస్తున్నారు.
సీజను అయిపోయాక, ఫలితం వుండదనితెలిసీ కూడా పరుగులు తీయించిన ముఖ్యమంత్రి వైఖరిని ఇంజనీరింగ్ అధికారులు తిట్టుకుంటున్నారు. షెడ్యూలు ప్రకారం పని జరిగి వుంటే వచ్చే సీజన్ కి పుష్కలంగా నీరు ఇచ్చే పరిస్ధితి వుండేది.
నీళ్ళు చాలవని తెలిసికూడా పట్టిసీమ ఎత్తిపోతల పధకాన్ని ఒకసారి జాతికి అంకితంగా, మరోసారి ఇబ్రహీంపట్టణం వద్ద సభగా, ఆవెంటనే పట్టిసీమవద్ద ప్రారంభోత్సవంగా…మొత్తం మీద అనేక ఈవెంట్ల మెగా ఈవెంటుగా ముఖ్యమంత్రి ఎందుకు మార్చేస్తున్నారన్నది సూటిగా సమాధానం దొరకని ప్రశ్న. ఇతరవిషయాలు ఎలా వున్నా “నీళ్ళు వచ్చేశాయి” అన్న భారీ ప్రచారం రాజధాని ఏరియా అంతటా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్ద ఊపునిస్తుంది.