తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణలో తిరుగులేదని నిరూపణ అవుతోంది. కేసీఆర్ సర్కారు మీద ప్రజల్లో విశ్వాసం నానాటికి పెరుగుతున్నదా అనే అభిప్రాయం కలుగుతోంది. మెదక్‌జిల్లా నారాయణఖేడ్‌లో జరిగిన ఎమ్మెల్యే ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ఆ పార్టీ ప్రదర్శిస్తున్న అప్రతిహతమైన మెజారిటీలే ఇందుకు నిదర్శనం. కేవలం నాలుగోరౌండ్ ముగిసే సమయానికి 11 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో తెరాస అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారంటే.. తెరాస హవా ఏ రీతిగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
మొన్నటికి మొన్న వరంగల్ ఎంపీ ఉపెన్నికలో తెరాస హవా ప్రదర్శిస్తే.. అది గతంలోనూ వారు గెలిచిన స్థానమే కదా.. వారి స్థానంలో మళ్లీ వారు గెలవడం కూడా గొప్పేనా.. అంటూ విపక్ష పార్టీలు ఆత్మవంచన డైలాగులు వల్లించాయి. అయితే గత ఎన్నికల్లో పోటీచేయడానికి కూడా తెరాస సంకోచించిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఈ దఫా తొలిసారి బరిలోకి దిగి.. చరిత్రలో ఎన్నడూ ఏ పార్టీకి దక్కని మెజారిటీలను తెరాస సాధించింది. దీనికి కూడా వివిధ రకాల రంగులు పులమడానికి కొన్ని పార్టీలు ప్రయత్నించాయి. తాజాగా గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నారాయణఖేడ్‌లోనూ తెరాస విజయదుందుభి మోగిస్తున్నది.
మరికొద్ది గంటల్లో ఖేడ్ ఎన్నిక పూర్తవుతుంది. ప్రస్తుతం ఉన్న పోకడను బట్టి తెరాస విజయం ఖరారుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రసమితికి తిరుగులేని ప్రజాదరణ లభిస్తున్నదనడానికి ఇవన్నీ నిదర్శనాలుగానే నిలుస్తున్నాయి.