ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇవ్వాళ్ళ వైకాపా అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. కారణాలు అందరికీ తెలిసినవే. దాని వలన తెదేపా ప్రభుత్వానికి ఏమీ నష్టం ఉండదని కూడా అందరికీ తెలుసు. పైగా సోమవారం వరకు శాసనసభ సమావేశమవదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చింతగా ఈరోజు లండన్ కి బయలుదేరుతున్నారు. ఆయనతో బాటు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రభుత్వ సలహాదారు వి.రవికుమార్, ఆర్ధికశాఖ ప్రధాన కార్యదర్శి పివి రమేష్, తదితరులు కూడా లండన్ వెళతున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం డిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో సమావేశం అవుతారు. ఆమెతో పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించి, దానికి అవసరమయిన నిధులు విడుదల చేయమని కోరుతారు. ఆ తరువాత ఈరోజు రాత్రి డిల్లీ నుంచి మూడు రోజుల లండన్ పర్యటనకు బయలుదేరుతారు. లండన్ లో పారిశ్రామికవేత్తల మండలి సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను, రాష్ట్రం సాధించిన ఆర్ధిక ప్రగతి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం గురించి వారికి వివరించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా వారిని కోరుతారు. లండన్ లో ఉన్న ప్రవాసభారతీయులను రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకోమని ప్రోత్సహిస్తారు. చంద్రబాబు నాయుడు ఆయన బృందం మార్చి 13న మళ్ళీ లండన్ నుండి తిరిగి రాష్ట్రానికి బయలుదేరుతారు.