ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మరొక రెండు వారాలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన తన పదవీ కాలం పొడిగించమని ప్రభుత్వాన్ని అభ్యర్ధించలేదు. అలాగే ప్రభుత్వం కూడా పదవీ కాలం పొడిగించాలనుకోవడం లేదని సమాచారం. కనుక ఆయన స్థానంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న సత్యప్రకాష్ టక్కర్ లేదా రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి అశ్వినీ కుమార్ పరిడాలలో ఎవరో ఒకరిని నియమించవచ్చని తెలుస్తోంది.
వారిలో సత్యప్రకాష్ టక్కర్ రాష్ట్ర ఆర్దికప్రగతికి చేసిన విశేష కృషి కారణంగా రెండంకెల అభివృద్ధి సాధించగలిగింది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ‘ఐదు గ్రిడ్స్-ఏడు మిషన్స్’ అనే కార్యక్రమానికి సత్యప్రకాష్ టక్కర్ రూపొందించారు. ఆయన చాల చురుకుగా నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా అమలుచేయిస్తారనే మంచి పేరుంది. కానీ సీనియారిటీ ప్రకారం చూసుకొన్నట్లయితే అశ్వినీ కుమార్ పరిడాకే అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.
అశ్వినీ కుమార్ మిగిలిన అందరి కంటే సుదీర్గాకాలం పాటు చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. పైగా టక్కర్ తో పోలిస్తే పరిడా పదవీకాలం ఇంకా చాలా రోజులుంది. టక్కర్ ఈ ఏడాది ఆగస్ట్ నెలలో, పరిడా వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో పదవీ విరమణ చేస్తారు. కనుక సహజంగానే పరిడాకే ఈ అవకాశం దక్కవచ్చును. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టక్కర్ ని ఎంచుకొన్నట్లయితే, ఆయన పదవీ కాలం ఆరు నెలలు పొడిగించేఅవకాశం ఉంటుంది.
ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ కి ప్రత్యేక కార్యదర్శిగా చేస్తున్న 1982 బ్యాచ్ కి చెందిన రమేష్ కుమార్ నిమ్మగడ్డపేరు కూడా వినిపించింది. కానీ మరొక మూడు నెలలో ఆయన పదవీ కాలం ముగిసిపోతుంది. కనుక ఆయనకి అవకాశం లేనట్లే భావించవచ్చును. ఇంకా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది కనుక త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిరువురిలో ఎవరో ఒకరిని రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమించవచ్చును.