‘జర్నలిజం’ అనే పదానికి ఒకటే నిర్వచనం ఉంటుంది. వాస్తవాల్ని ప్రజలు అందించడం! కానీ, న్యూస్ కి వ్యూస్ జోడించడం అనేది కూడా పాత్రికేయంగా చలామణి అవుతున్న రోజులివి! తమకు అవసరమైన అంశాల పట్ల సానుకూలంగా… అనవసరం అనుకున్న విషయాల పట్ల విముఖంగా ఉండటం కొన్ని సంస్థలకే చెల్లుతుంది. విలువలతో కూడిన జర్నలిజం తమదే అని చాటుకునే సాక్షి దిన పత్రిక… ఆ విలువల్లో రకాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటుంది! ఆ రకాలేంటో తెలియాలంటే… గడచిన పదిరోజులుగా సాక్షిలో డ్రగ్స్ కేసు నేపథ్యంలో ప్రచురితం అవుతున్న కథనాల గురించి ప్రస్థావించాలి.
నిజానికి, డ్రగ్స్ కేసు విషయంలో ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా వ్యవహరిస్తూ వస్తున్నామని వారే ఓపెన్ గా చెబుతున్నారు. సినీ రంగ ప్రముఖలను విచారిస్తున్న క్రమాన్ని కూడా రహస్యంగా ఉంచుతున్నారు. విచారణ మొత్తాన్ని చిత్రీకరిస్తున్నామనీ, ప్రశ్నలతో ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయడం లేదని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెబుతూనే ఉన్నారు. కానీ, మీడియాలో సినీ ప్రముఖుల విచారణ ఎలా సాగిందో అనేది తామే దగ్గరుండి చూసోచ్చిన విధంగా కొన్ని సంస్థలు రోజుకో కథనం వండి వార్చేస్తున్నాయి. ఈ కేసు విషయంలో సాక్షి మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని చెప్పొచ్చు. దీని కంటే ముందు… గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ విచారణ ఎదుర్కొన్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి.
అప్పట్లో, జగన్ విచారణకు వెళ్లిన సందర్భం ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఆ సందర్భంలో సాక్షి పత్రిక పోషించిన పాత్ర ఏంటంటే… జగన్ కేసు ఇన్వెస్టిగేషన్ వివరాలు బయటకి లీక్ అవుతున్నాయని ఆవేదన చెందడం! జగన్ కేసు విచారణ జరుగుతున్న తీరు… అధికారులు జగన్ ను ఏయే అంశాలు ప్రశ్నించారనే క్రమం.. ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్న విధానంపై మీడియాలో కథనాలు వచ్చేవి. ఆ సందర్భంలో సాక్షి ఆవేదన ఒక్కటే.. అత్యంత రహస్యంగా జరగాల్సిన విచారణకు సంబంధించిన సమాచారం బయటకి ఎలా పొక్కుతోందని? అప్పట్లో జేడీ లక్ష్మీ నారాయణే ఈ సమాచారాన్ని బయటకి లీక్ చేస్తున్నారన్నట్టుగా అనుమానించడమే సాక్షి కొన్నాళ్లు పనిగా పెట్టుకుంది. ఇంత కీలకమైన కేసులో విలువైన సమాచారాన్ని మీడియాకి ఎలా లీక్ చేస్తారనీ, విలువలు పాటించాలంటూ సాక్షి ఎలుగెత్తింది.
ఇక, ఇప్పటి డ్రగ్స్ కేసు విషయంలో సాక్షి అనుసరిస్తున్నదేంటో ఒక్కసారి చూద్దాం! గడచిన కొన్ని రోజులుగా డ్రగ్స్ విషయమై ఎక్స్ క్లూజివ్ కథనాలు అందిస్తోంది. ఉదాహరణకు, ముమైత్ ఖాన్ విషయంలో కథనం ఏంటంటే… పూరీతో లింకుల్ని ప్రశ్నించారనీ, బ్యాంకాక్ ట్రిప్పులెందుకనీ సిట్ నిలదీసినట్టు రాశారు. హీరో రవితేజను సిట్ అధికారులు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారనీ, జీశాన్ కెల్విన్లతో సంబంధాలపై ఆరా తీశారనేది వారి కథనం. చార్మి విచారణ విషయంలో మరింత అత్యుత్సాహం కనిపిస్తుంది. ‘చార్మీ దాదా’ అంటూ ఓ కథనం ప్రచురించి… కెల్విన్ తో ఎందుకు వాట్సాప్ ద్వారా టచ్ లో ఉంటున్నారంటూ ఆమెను సిట్ నీళ్లు తాగించేసిందన్న రేంజిలో ప్రెజెంట్ చేశారు. నవదీప్ తోపాటు ఇతర సెలెబ్రిటీల విషయంలో కూడా దాదాపు ఇలాంటి కథనాలే వేశారు. డ్రగ్స్ కేసు విషయంలో ఐటీ ఇండస్ట్రీ కూడా తూలుతోందని ఓ కథనం అచ్చేశారు. పదుల సంఖ్యలో కంపెనీల్లో వందల కొద్దీ సిబ్బంది డ్రగ్స్ పీడితులంటూ రాశారు. గడచిన పదిరోజులుగా ఇదే తంతు.
అప్పటి జగన్ కేసు విచారణ సమయంలో.. ఇప్పుడు డ్రగ్స్ కేసు విచారణ తరుణంలో సాక్షి అనుసరిస్తున్న విలువలేంటో ఈపాటికే అర్థం చేసుకోవచ్చు. జగన్ విచారణ వివరాలను నాడు ఇతర పత్రికలకు లీక్ చేయడం విలువల్లేని తనమైతే… ఇప్పుడు సిట్ విచారణలో ఏం జరుగుతుందో రోజుకో రకంగా వండి వార్చుతున్న తీరును ఏమనాలి..? జగన్ విచారణ విషయాలను జేడీ లక్ష్మీనారాయణ బయటకి చెప్పేస్తున్నట్టు నాడు గగ్గొలు పెట్టి… ఇవాళ్ల డ్రగ్స్ కేసు విషయంలో లోతైన కథనాలు వారే ప్రచురిస్తుస్తూ తీరును సాక్షి చేస్తున్నదేంటీ..? ‘విలువలు’ అనేది మనకు కన్వీన్యంట్ గా రాసుకునేందుకు వీలున్న టాపిక్ కాదు కదా! డ్రగ్స్ కేసు నేపథ్యంలో విచారణ ఎదుర్కొంటున్నవారికి వెనకేసుకుని రావడం ఈ చర్చ ఉద్దేశం కాదు. ఈ క్రమంలో సాక్షి అనుసరిస్తున్న తీరును, పాటిస్తున్న పాత్రికేయ విలువల్ని ఎత్తి చూపడమే ముఖ్యోద్దేశం.