ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ఇల్లు కొనేవారికి మంచి ప్రోత్సహం ఇచ్చింది. ఈ పథకాన్ని మధ్యలో ఆపేశారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మళ్లీ ప్రకటించారు. మొదట పీఎంఈవై పథకాన్ని 2015లో తీసుకు వచ్చారు. ఇంటి నిర్మాణం, కొనుగోలు కోసం తీసుకునే రుణాలపై చెల్లించే వడ్డీలో రాయితీని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పొంద వచ్చు.
రూ.3 లక్షల నుంచి 18 లక్షల వరకూ ఆదాయం ఉన్న అన్ని వర్గాల ప్రజలకూ లబ్ది చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. భారతీయులైతే చాలు. అయితే వారు కొనుగోలు చేసేది మొదటి ఇల్లుఅయి ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా మరే ఇతర గృహ సంబంధిత పథకాల ప్రయోజనాలను గతంలో పొంది ఉండకూడదని నిబంధన ఉంది.
మహిళలకు తక్కువ వడ్డీరేటుకే రుణాలు లభిస్తాయి. రుణం ఎంత మొత్తమైనా తీసుకోవచ్చు. కానీ ఈ పథకం ప్రయోజనం సదరు రుణ మొత్తంలో రూ.12 లక్షల వరకే వర్తింప చేస్తారు. గరిష్ఠంగా రూ.2.67 లక్షలదాకా సబ్సిడీ లభిస్తుంది. మహిళలకు రుణంపై రూ.1.5 లక్షలదాకా, వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. దంపతులిరువురికీ ఆదాయం ఉన్నట్లయితే ఈ ప్రయోజనం రూ.3 లక్షలు, రూ.4 లక్షలదాకా ఉంటుంది.
ఈ పథకం కింద వడ్డీ రాయితీని ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. పీఎంఏవై అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంఏవై పథకం వర్తించే బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద రుణం తీసుకుంటే మిగతా ప్రక్రియ వారు పూర్తి చేస్తారు. ఈ పథకం వల్ల కలిగే మేలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లు కొనేవారు కూడా పెరిగారు.