భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అందరినీ కంట్రోల్ చేస్తుంది. తనను మాత్రం ఎవరూ కంట్రోలో చేయవద్దనేదే దాని ధోరణి. చట్టానికి, రాజ్యాంగానికి అతీతంగా ఇష్టారాజ్యంగా చక్రం తిప్పడమే బోర్డు పెద్దలకు తెలుసు. అలాంటి బోర్డు, మొదటిసారిగా తల వంచింది. వంకలు, కొర్రీలు పెట్టకుండా నోరు మూసుకుని ఆదేశాలను పాటించింది. మహారాష్ట్రలో తీవ్ర కరువు వల్ల ఏప్రిల్ 30 తర్వాత ఆ రాష్ట్రంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్ లను తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. అప్పీల్ కు వెళ్తాం, ఇంకేదో చేస్తామని ఎదురు దబాయింపు మాటలు చెప్పకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్టు చేసుకోవడం ఆశ్చర్యమే.
హైకోర్టు తీర్ప వల్ల ప్రభావితమయ్యే ముంబై, పుణే జట్ల యజమానులతో ఐపీఎల్ చైర్మన్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ముంబైలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ను బెంగళూరులో నిర్వహించాలని నిర్ణయించారు. పుణే జట్టు విశాఖను వేదికగా ఎంచుకుంది. ముంబై జట్టు ఆదివారం నాడు ఏ సంగతీ చెప్తుంది.
హైకోర్టు తీర్పుపై విస్తృత ధర్మాసనంలోగానీ సుప్రీం కోర్టులో గానీ అప్పీలు చేయాలని బోర్డు నిర్ణయించలేదు. దీనికీ కారణాలున్నాయి. మరాఠ్వాడా ప్రాంతంలో నెలకొన్న కరువు వల్ల ప్రజలకు తాగడానికి నీళ్లు లేక విలవివల్లాడుతున్నారు. అక్కడి పరిస్థితులను మీడియా బాగా ఫోకస్ చేసింది. బీసీసీఐ నిర్వాకాన్ని ఎండగట్టింది. దీంతో బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే, హైకోర్టులో అప్పీలు చేస్తే అనుకూలంగా తీర్పు రావడం డౌటే అని బోర్డు పెద్దలు భావించి ఉంటారు.
ఇక సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలంటే ఏ ముఖం పెట్టుకుని వెళ్తారనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. సంస్కరణలను వ్యతిరేకించడం, లోధా కమిటీ సిఫార్సుల అమలుకు తిరస్కరించడం వంటి కారణాలతో బోర్డు ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికాయలు తింటోంది. రాజకీయ నాయకులు బోర్డును భ్రష్టు పట్టించడం ఎందుకనే ప్రశ్నకు క్రికెట్ పెద్దల దగ్గర జవాబు లేదు. సంస్కరణలను అంగీకరించనందుకు ఇప్పటికే అనేక సార్లు సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది. బోర్డును ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదుచెప్పాలని కూడా నిలదీసింది. పదే పదే మొట్టికాయలు తినడం బోర్డుకు అలవాటుగా మారింది. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ విషయంలో అప్పీలుకు వెళ్తే సుప్రీం కోర్టు తిట్టడం ఖాయమని బోర్డు భావించి ఉండొచ్చు.
క్రికెట్ బోర్డులో ఒకప్పుడు మానత్వం కనిపించేది. మరాఠ్వాడా కరువు వంటివి సంభవించినప్పుడు, లాభాల్లో కొంత విరాళంగా ఇచ్చేవారు. పైగా అప్పుడు ఇంత ఆదాయం లేదు. ఐపీఎల్ అనే ఫక్తు కమర్షియల్ టోర్నీ లేదు. ఇప్పుడు వేల కోట్ల లాభాలు వస్తున్నాయి. అయినా మానవ సేవ,మానవత్వం అనేవి బోర్డులో మచ్చుకైనా కనిపించడం లేదు. ఎంతసేపూ డబ్బు కక్కుర్తే కనిపిస్తోంది. అసలు వేల కోట్ల వ్యవహారంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందులో భారీగా అవినీతి జరుగుతోందా అనేది కూడా ఎవరికీ అంతుపట్టని మిస్టరీగా మారింది బోర్డు వ్యవహారం. ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.