హైదరాబాద్: ఇల్లు కట్టుకోవటానికో, పై చదువులకోసమో, వాహనాల కొనుగోలు కోసమో అప్పు తీసుకోవటం సహజం. అయితే ఒక ఉపఎన్నికలో పోటీచేయటంకోసం అప్పు ఇవ్వాలని బ్యాంక్‌కు దరఖాస్తు చేసి సంచలనం సృష్టించాడో యువకుడు. వచ్చే నెలలో జరిగే వరంగల్ ఉపఎన్నికలో పోటీచేసేందుకు రు.5 లక్షల రుణాన్ని మంజూరు చేయాలంటూ హైదరాబాద్ బాగ్ అంబర్ పేటకు చెందిన వెంకట నారాయణ అనే యువకుడు కెనరా బ్యాంక్ నల్లకుంట శాఖను ఆశ్రయించాడు. సంఘ సేవకుడినయిన తాను, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేయాలనుకుంటున్నానని, తనకు ప్రచారం ఖర్చులకు డబ్బులేనందున రుణం తీసుకోవాలనుకుంటున్నానని అతను తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఈ రుణ మొత్తాన్ని నామినేషన్ పేపర్లు దాఖలు చేయటానికి, కరపత్రాలు ముద్రించటానికి, ఇతర ప్రచార సామాగ్రి ఖర్చుకు ఉపయోగిస్తానని చెప్పాడు.
వెంకట నారాయణ 2014 అసెంబ్లీ ఎన్నికలలో అంబర్ పేట నియోజకవర్గంనుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. అతను తన కాలనీలోని పేదవారికోసం జన సంక్షేమ సంఘం అనే స్వచ్ఛందసంస్థను నడుపుతున్నాడు. తాను ప్రజా ప్రతినిధిగా ఎన్నికయితే పేదవారికోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు నడపగలుగుతానని, అధికారులకు ఆదేశాలిచ్చి పనులు చేయించగలుగుతానని, అందుకే తాను పోటీచేస్తున్నానని చెబుతున్నాడు. గత శుక్రవారం బ్యాంక్‌కు లోన్ కోసం దరఖాస్తు సమర్పించాడు. మరోవైపు ఇలాంటి అవసరంకోసం లోన్ దరఖాస్తు తమవద్దకు రావటం ఇదే మొదటిసారని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ అప్లికేషన్‌ను హెడ్ ఆఫీస్‌కు ఫార్వార్డ్ చేశామని తెలిపారు. ఇదిలా ఉంటే ఎన్నికలలో పోటీచేయటానికి వ్యక్తులకు బ్యాంక్‌లు రుణాలు ఇచ్చేలా చట్టం చేయాలంటూ వెంకటనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోడికి ఒక లేఖకూడా రాశారు.