ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారుల్ని ప్రభుత్వం ఎస్ఈసీకి చెప్పకుండా బదిలీ చేయడం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ఫలితాలను వైసీపీకి అనుకూలంగా ఉండేలా చూడకపోతే.. వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయకపోతే.. చర్యలు తీసకుంటామని .. ఆ పార్టీ నేతలు.. పెద్దలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో… ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారందరికీ భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాజ్యాంగ రక్షణ అందరికీ ఉంటుందని ఎన్నికల విధుల్లో పాల్గొనేవారిపై ఎలాంటి చర్యలు తీసుకునే చాన్స్ లేదని చెబుతున్నారు. ఏ చర్య తీసుకోవాలన్న ఎస్ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే అనూహ్యంగా ఆయన అనుమతి తీసుకోకుండా… కారణం లేకుండా ఎన్నికల అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసేస్తోంది. దీనిపై నిమ్మగడ్డ తదుపరి చర్యలు ప్రారంభించారు.
ఇటీవల కొంత మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, పరిశీలకులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ జాబితాను సేకరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. బదిలీ చేసిన వారందర్నీ పాత స్థానాల్లోనే మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని ఆయన నేరుగానే చెప్పేశారు. ప్రభుత్వం కింది స్థాయి అధికారుల్నే కాదు.. ఐఏఎస్ అధికారుల్ని కూడా బదిలీ చేస్తోంది. నెల్లూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న బసంత్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి .. టీటీడీ జేఈవోగా ఉన్నారు. ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టింది. దీనికి కారణం… నిమ్మగడ్డ తిరుమల పర్యటనలో ఆయన కూడా పాల్గొనడమే.
ఇతర ఆఫీసర్లు… వైసీపీ స్థానిక నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. తాము చెప్పినట్లుగా చేయడం లేదని కొంత మందిని బదిలీ చేయిస్తున్నారు. ఇవన్నీ గుట్టుగా సాగుతున్నాయి. ఎస్ఈసీ దృష్టికి రావడంతో ఆయన రంగంలోకి దిగారు. నిబంధనల ప్రకారం… ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎవర్నీ బదిలీ చేయకూడదు. తప్పనిసరిగా చేయాలంటే.. కారణం చెప్పాల్సి ఉంటుంది. కానీ కారణం చెప్పకుండానే ప్రభుత్వం బదిలీ చేసేస్తోంది. ఇప్పుడు ఈ బదిలీల్ని అడ్డుకోకపోతే… తమకు రక్షణ ఎస్ఈసీ ఇవ్వలేదన్న అభిప్రాయానికి ఉద్యోగులు వస్తారు. దాని వల్ల వారు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహించడానికి అవకాశం ఉండదు.
ఐఏఎస్ అధికారి బసంత్ కుమార్ నిజాయితీ పరుడైన అధికారిగా పేరుంది. ఆయన ఎప్పుడూ కీలకమైన పోస్టుల్లో లేరు. కానీ.. ఆయన తన ఇంట్లో పెళ్లిళ్లను.. వందల రూపాయలతోనే చేస్తూంటారు. ఆడంబరాలకు అసలు ఖర్చు పెట్టరు. ఆయన కుటుంబ జీవన శైలిభిన్నంగా ఉంటుంది. మచ్చలేని అధికారి. అయనపైనా ప్రభుత్వం చర్య తీసుకోవడంతో… ప్రభుత్వం తీరుపై అధికారవర్గాల్లోనే చర్చ జరుగుతోంది.