హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై నిషేధం విధించి మంగళవారానికి ఒక సంవత్సరమయింది. తెలంగాణ అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం సందర్భంగా తడబడటాన్ని పరిహాసం చేస్తూ కార్యక్రమాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఎమ్ఎస్ఓలు టీవీ9, ఏబీఎన్ ఛానళ్ళపై అప్రకటిత నిషేధాన్ని విధించాయి. అయితే పేరుకు ఎమ్ఎస్ఓలు అని చెబుతున్నప్పటికీ అసలు నిషేధం విధించింది కేసీఆర్ ప్రభుత్వం అన్నవిషయం అందరికీ తెలిసిందే. అయితే టీవీ9 ప్రసారాలను ఆరునెలలక్రితం పునరుద్ధరించినప్పటికీ ఏబీఎన్‌పై నిషేధం కొనసాగుతోంది.
నిషేధంపై మంగళవారం హైదరాబాద్‌లో ఒక సదస్సు జరిగింది. జర్నిలిస్టు నాయకులు శ్రీనివాసరెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, నాగం జనార్దనరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఎర్రబెల్లి దయాకరరావు, దాసోజు శ్రవణ్, చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఒకరకంగా చూస్తే ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణకు సన్నిహితులైన రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం వెంటనే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని వక్తలంతా డిమాండ్ చేశారు.