హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారు. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని అంటున్నారు. కొంత మంది పేదల్ని ముందు పెట్టి భారీ రాజకీయం చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా కూల్చివేతలపై బీఆర్ఎస్ రాంగ్ ట్రాక్‌లోనే వెళ్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హైడ్రా ఇప్పటి వరకూ బడా బాబులవే ఎక్కువగా కూల్చింది. కూకట్ పల్లి నల్ల చెరువులో రాజకీయ నేతలు కబ్జాలు చేసి అద్దెలకు ఇచ్చుకున్న వాటిని కూల్చివేసింది. అక్కడ కింద పడి ఏడ్చింది కూడా అద్దెకు తీసుకున్న వాళ్లే. ఇలాగే అమీన్ పూర్ .. కిష్టారెడ్డి ప్రాంతాల్లో కూల్చివేతలన్నీ ప్రభుత్వ, చెరువు స్థలాల్లోనే. అక్కడి కూల్చివేతలను వ్యతిరేకించడం అంటే… కబ్జాలను ప్రోత్సహించినట్లే అవుతుంది. నిజానికి బీఆర్ఎస్ హయాంలో ప్రైవేటు భవనాల పైకి వెళ్లారు. అయ్యప్ప సొసైటీ సహా… శేరిలింగంపల్లిలో అనుమతి లేకుండా కట్టారని అనేక ఇళ్లను కూలగొట్టారు. కానీ ఇప్పుడు అనుమతుల పేరుతో ప్రైవేటు ఆస్తులపై దాడులు చేయడం లేదు. ప్రభుత్వ ఆస్తుల్లో కట్టిన వాటిని కూల్చేస్తున్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోందంటే దానికి కారణం.. అవన్నీ తమ హయాంలో కబ్జా చేసినవి…తమ పార్టీ నేతలు చేసినవి కావడమేనని ఎక్కువ మంది భావిస్తున్నారు, ఇలాంటి అభిప్రాయం వచ్చేలా ఆ పార్టీ స్ట్రాటజీ ఉంది. ఇటీవల విజయవాడ వరదలు.. అంతకు ముందు హైదరబాద్ వరదల ను గుర్తుకు తెచ్చుకున్న ఎవరూ ఇలాంటి వాటిని ఖండించరు. ఒక వేళ సమర్థిస్తే.. రాబోయే రోజుల్లో మరితం పెరిగిపోతాయి. రాత్రికి రాత్రి చెరువు లో కట్టేసుకుని కూల్చేస్తే.. ఏడుస్తారు. అలాంటి వాటిని సమర్థించడం ఏ రాజకీయ పార్టీకీ అయినా మైనస్సే. ఇప్పుడు బీఆర్ఎస్ అదే పని చేస్తోంది.
రోడ్లను , ఫుట్ పాత్లను ఆక్రమించిన వాటిని తొలగించినా రచ్చ చేస్తున్నారు. వాటిని అలా బీఆర్ఎస్ సమర్థించగలదా ?. నిజానికి అవన్నీ లోకల్ లీడర్లు అద్దెకు ఇచ్చేసుకున్నారు . అక్కడ వ్యాపారాలు చేసే వారెవరూ ఆక్రమించుకోలేదు. ఇలాంటివాటిని సమర్థిస్తూ బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది. సామాన్యప్రజలలో మాత్రం… సంతృప్తి వ్యక్తమవుతోంది.