ఈమధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అధ్యాత్మికవేత్తలు ఎక్కువైపోయారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మంచిదే కదా… ఆధ్యాత్మికవేత్తలు అనబడేవారు నాలుగు మంచి మాటలు చెబితే… కుటుంబాలు బాగుంటాయి, మనుషులు బాగుంటారు, సమాజం బాగుంటుంది! అని భావించినవారికి షాకిచ్చేలా తాజా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పుష్కరాలు మంచిదని ఒక పెద్దాయన అంటే… అసలు పుష్కరాల్లో కచ్చితంగా స్నానం చేయాలని ఎవరు అన్నది, అవి పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడానికి మాత్రమే అని మరొకరు వ్యాఖ్యానిస్తుంటారు. దీనిలో ఏది వాస్తవం అనే విషయం కాసేపు అలా ఉంచితే… ఆ రెండు ప్రసంగాలు విన్న భక్తుడి పరిస్థితి మాత్రం ప్రశ్నార్ధకం! ఆ సంగతులు అలా ఉంచితే… తాజాగా ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు మరోవివాదంలో చిక్కుకున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సలహాదారు అయిన చాగంటి కోటేశ్వరరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో మహిళలను అవమానపరిచేలా మాట్లాడారని విమర్శలు ఎదుర్కొన్న ఆయన తాజాగా ఓ కులంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని సదరు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాముడు మహారాజు ఇంట్లో పుట్టాడు అని చెప్పిన అనంతరం శ్రీకృష్ణ భగవానుని ప్రస్థావన వచ్చినప్పుడు మాత్రం వెనకా ముందూ చూసుకోకుండా యాదవ సామాజికవర్గానికి ఆగ్రహం కలిగించేలా మాట్లాడారు!! దీంతో ఆ సామాజికవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతోపాటు చాగంటి దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఒక చానల్ లో శ్రీకృష్ణ భగవానుని పురాణం చెబుతూ శ్రీకృష్ణుడు… “ఏమీ తెలియని వాళ్లు, తలకడిగితే మొల కడగరు, మొలకడిగితే తలకడగరు.. అటువంటి గొల్లవాళ్ల ఇంట్లో పుట్టాడు” అని చెప్పడం ద్వారా యాదవులు శుభ్రంగా ఉండరు అనే విధంగా యాదవులను కించపరిచారని బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర ఉపాద్యక్షులు, యాదవ సంఘం అధ్యక్షులు జేకే శేఖర్ యాదవ్ మండిపడ్డారు. ఈ క్రమంలో చాగంటి కోటేశ్వర్ రావు తన వాఖ్యాలను వెంటనే ఉపసంహరించుకుని అదే చానల్ ద్వారా వెంటనే సదరు కులస్థులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం యాదవుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసంగించిన చాగంటి కోటేశ్వర్ రావుపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఆధ్యాత్మికవేత్తలంటే మరీ ఇంత అనాలోచితంగా మాట్లాడతారా అనే అనుమానం రేకెత్తించేలా చాగంటి మాటలు విన్న ఆయన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారట. ఒక మాట మాట్లాడేముందు వెనకా ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాల్సిన పెద్దమనిషి ఇలా ఒక కులాన్ని తక్కువచేసినట్లు మాట్లాడటంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.