ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏర్పడిన సయోద్యను నిలుపుకోనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. అంతేకాదు కేసీఆర్ తో తన దోస్తీ కొనసాగించేందుకు ఇక ముందు తెలంగాణా రాజకీయాలలో జోక్యం తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తెలంగాణా తెదేపా వ్యవహారాల బాధ్యతలను అక్కడి నేతలకే అప్పగించాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. “పార్టీల పరంగా తెలంగాణాలో మీపని మీరు చేసుకుపోండి..ప్రభుత్వపరంగా మా పని మేము చేసుకుపోతుంటామని” చంద్రబాబు నాయుడు తన తెలంగాణా పార్టీ నేతలకి చెప్పినట్లు వార్తలు వచ్చేయి. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసే పూర్తి బాధ్యతలు అక్కడి నేతలకే అప్పగించి, పార్టీ శ్రేయస్సు కోసం ఎటువంటి నిర్ణయాలయినా తీసుకొనే పూర్తి స్వేచ్చ వారికి ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు నిజమనుకొంటే ఇంతవరకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెరాసతో ఏవిధంగా వ్యవహరిస్తున్నారో ఇకపై చంద్రబాబు నాయుడు కూడా అదేవిధంగా వ్యవహరించబోతున్నారని భావించవచ్చును. ఆ రెండు పార్టీల మధ్య అప్పుడు కనబడే ఒకే ఒక తేడా ఏమిటంటే తెలంగాణాలో ఏమి జరుగుతున్నా వైకాపా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోని ఉంటే, తెదేపా మాత్రం యధావిధిగా తన పోరాటాలను కొనసాగిస్తుందన్న మాట. కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు నిజంగానే కేసీఆర్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తే, అప్పుడు ఆ పరిస్థితి కూడా తారుమారు అవవచ్చును. అప్పుడు తెదేపా కూర్చొంటే, వైకాపా పోరాటాలు మొదలుపెట్టవచ్చును.
తెలంగాణా ప్రభుత్వంతో, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సయోధ్య కోసం ఒకవేళ తెలంగాణాలో పార్టీ వ్యవహారాలలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోకపోయినట్లయితే దాని ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చును. ఎందుకంటే తెలంగాణాలో పార్టీకి వెన్నెముక వంటి ఇద్దరు ముఖ్య నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ఇరువురి మధ్య విభేదాలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. వారిలో ఎర్రబెల్లి తెరాసలోకి వెళ్లేందుకు ప్రయత్నించి ఆఖరు నిమిషంలో ఆగిపోయారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పక్కకు తప్పుకొన్నట్లయితే తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లికి పొగ పెట్టవచ్చును. అలాగే మరికొంతమంది నేతలను తెరాస ఆకర్షింఛి తీసుకుపోవచ్చును. తెదేపా పరిస్థితిని బట్టి మరికొందరు కాంగ్రెస్, బీజేపీలలోకి వెళ్లిపోవచ్చును. కనుక కేసీఆర్ తో దోస్తీ ముఖ్యమా లేక తెలంగాణాలో తెదేపాను కాపాడుకోవడం ముఖ్యమా? కేసీఆర్ తో దోస్తీ కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని పణంగా పెడతారా లేదా? అనే ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి.