వై.యస్సార్ కాంగ్రెస్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని “చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఆదేశాల మేరకు పోలీసుల సహాయంతో గుడివాడలో మా పార్టీ కార్యాలయం ఖాళీ చేయించారు. చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మా పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయించారు సరే ఇప్పుడేమి చేస్తారు? పోలీసుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలను భయపెట్టాలని తెదేపా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ అటువంటి బెదిరింపులకి భయపడబోము. చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే హైదరాబాద్ లో తేల్చుకోవడానికి నేను సిద్దం,” అని అన్నారు.
కొడాలి మాటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా ఘాటుగా స్పందించారు. “కొందరు రాజకీయ నాయకులు తమను చూసి సామాన్య ప్రజలు భయపడాలని భావిస్తుంటారు. పార్టీ పెట్టుకోవడానికి ఒక ముసలావిడ తన ఇంటిని వైకాపాకు అద్దెకు ఇచ్చేరు. మళ్ళీ ఆమె కోరినప్పుడు మర్యాదగా ఇల్లు ఖాళీ చేసి ఇవ్వకుండా ఆమెను భయపెట్టాలని చూసారు. అందుకే పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. అతను పొరపాటు చేసి మళ్ళీ ఆ విషయాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయనాయకులు సామాన్య ప్రజలతో తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నేరాలకి, దౌర్జన్యాలకి పాల్పడితే ఎంతటి వారినయినా ఉపేక్షించేది లేదు. సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడం, వారిలో భద్రతాభావం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. సామాన్యులయినా, రాజకీయ నాయకులయినా అందరూ ప్రభుత్వానికి సమానమే. నాగరిక ప్రపంచంలో సామాన్య ప్రజలు అభద్రతాభావంతో బ్రతకడం చాలా అవమానకరమయిన విషయంగానే భావిస్తాము. అందుకే శాంతిభద్రతల పరిరక్షణలో చాలా కఠినంగా, నిర్మొహమాటంగా వ్యవహరిస్తామని ఆయన చెప్పారు.