చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకుంటే పది అడుగులు ఆయనను వెనక్కు లాగడానికి అనేక మంది తయారుగా ఉంటూ ఉంటారు. నిజానికి చంద్రబాబు ఒక్కడికే కాదు.. రాజకీయాల్లో ఏ నాయకుడికి అయినా ఇలాంటి పరిస్థితి చాలా సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే.. ఏ నాయకుడు అయినా సమాజాన్ని, ప్రజల్ని లేదా కనీసం తమ సొంత పార్టీని నిజంగా ముందుకు తీసుకువెళ్లిపోతే గనుక,, మిగిలిన రాజకీయ పార్టీలకు ఠికానా ఉండదు గనుక.. అలాంటి వారంతా తమ శక్తి వంచన లేకుండా వెనక్కు లాగడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. శత్రు పక్షాలకు చెందిన నాయకులు ఇలాంటి పనులు చేసినా మామూలే గానీ.. సొంత పార్టీకి చెందిన వారే వెనక్కు లాగడానికి ప్రయత్నిస్తే.. ఆ చర్యలను ఏం అనుకోవాలి? అదే దుస్థితి ఇప్పుడు పాపం చంద్రబాబుది! సొంత పార్టీలోని కీలకమైన తెలుగుతమ్ముడే చంద్రబాబు కంటున్న కలలకు సంబంధించి అపశకునాలు పలుకుతున్న వైనం ఇది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అధికారాన్ని పదిలంగా పదికాలాలపాటు కాపాడుకునే కోరికతో చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి దార్లు వెతుకుతున్నారు. అందులో భాగంగానే.. కాపులను బీసీల్లో చేర్చడం అనే పాశుపతాస్త్రాన్ని కూడా ప్రయోగించారు. తద్వారా.. పార్టీకి నిలకడైన ప్రజాదరణ దక్కుతుందని కలలు కంటున్నారు.
ఆయన తెలంగాణ ప్రాంతంలో ఆయన సొంతపార్టీకి చెందిన ఎమ్మెల్యే, తెలుగు తమ్ముడు, రెండు రాష్ట్రాల్లోను బీసీల నాయకుడిగా గుర్తింపు ఉన్న ఆర్.కృష్ణయ్య మాత్రం చంద్రబాబు ప్రయత్నాలకు అపశకునాలు పలుకుతున్నారు. తెదేపా బలోపేతం సంగతి తర్వాత.. అసలు కాపులను బీసీల్లో చేర్చడం అనేదే అసాధ్యం అని ఆర్.కృష్ణయ్య అంటున్నారు. ఆర్థికంగా ఎదిగిన ఆ వర్గాన్ని బీసీల్లో చేర్చడం అంత ఈజీ కాదని ఆయన వాదన. ఏపీలో కాపులను బీసీలు చేయడం చంద్రబాబు, మోదీ తరం కాదని కృష్ణయ్య ఘాటుగా వ్యాఖ్యానించడం విశేషం. ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని కూడా ఆయన చంద్రబాబుకు హితవు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లు ధర్మసత్రం కాదని అంటున్న ఆయన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లకోసం మాత్రం చంద్రబాబు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలనడం కొసమెరుపు.
చంద్రబాబునాయుడుకు సొంతపార్టీలోని ఇలాంటి నేతలు శల్యసారథ్యంలా తయారయ్యారన్న వ్యాఖ్యానాలు పార్టీలో బాగా వినిపిస్తున్నాయి. పార్టీ జనాదరణ పెంచడానికి చంద్రబాబు పాట్లు ఆయన పడుతోంటే.. ఇలా సొంత పార్టీ వారే అపశకునాలు పలుకుతూ శల్యసారథ్యం చేస్తుండం చికాకు పెడుతున్నట్లు కనిపిస్తోంది.