దేశంలోనే అయిదో స్వచ్ఛమైన నగరంగా విశాఖపట్టణానికి గుర్తింపు రావడం చాలా చిన్న విషయం. ఇప్పటికే స్మార్ట్ నగరంగా ఎంపికైంది. ఈ మధ్యే 54 దేశాల నావికా దళాలు పాల్గొన్న ఐఎఫ్ఆర్ (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ) ని విజయవంతంగా నిర్వహించింది. విశాఖ నగరం భవిష్యత్తులో చాలా చాలా చేస్తుంది. అంతర్జాతీయ రాజకీయ, ఆర్ధిక వేదికల మీద ఢిల్లీ, ముంబాయి ల మాదిరిగానే విశాఖ పేరూ వినిపించబోతోంది. అన్ని మౌలిక వసతులూ సిద్ధంగా వున్న హైదరాబాద్ కు దక్కవలసిన స్ధానం, రాష్ట్ర విభజన వల్ల ఆ నగరం భౌగోళికంగా మరోరాష్ట్రంలోకి వెళ్ళిపవడం వల్ల విశాఖ ప్రత్యామ్నాయ వేదిక అవుతోంది. ఇదంతా కేంద్రప్రభుత్వమో, రాష్ట్రప్రభుత్వమో నిర్ణయించిన లక్ష్యం కాదు. చైనాతో సహా ఆగ్నేయ ఆసియా దేశాల వాణిజ్య సాంస్కృతిక సంబంధాలకు ఇండియా ముఖద్వారమైన తీరాంధ్రప్రదేశ్ లో అమెరికా తన వ్యూహాత్మకమైన స్ధావరంగా విశాఖ నగరాన్ని ఎంచుకోవడమే ఈ పరిస్ధికి అసలు కారణం. మరింత సూటిగా చెప్పాలంటే ఇండియాలో చైనా అమెరికాల మధ్య బేలెన్సింగ్, కౌంటర్ బేలెన్సింగ్ సెంటర్ గా విశాఖపట్టణం రూపమెత్తబోతోంది. పారదర్శకత పాటించక పోవడం వల్లా, ఇదంతా తమ ఘనతే అని చెప్పుకనే అవకాశాన్ని వాడుకోవాలనుకోవడం వల్లా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అసలు విషయాన్ని చెప్పవు. ప్రాంతాలకే పరిమితమైపోవడం దేశంలో జరుగుతున్న పరిణామాలనే పట్టించుకోని పత్రికలు, టివిలు అంతర్జాతీయ విశేషాలను గమనిస్తున్నాయని కూడా అనుకోలేము. రాయటర్ లాంటి న్యూస్ ఏజెన్సీ వార్తల్ని చూస్తేతప్ప, జాన్సన్ చోరగుడి వంటి సామాజిక ఆర్ధిక విశ్లేషకుల వ్యాసాలు చదివితే తప్ప విశాఖపట్టణాన్ని స్మార్ట్ నగరంగా అమెరికా ఇప్పటికే ఎంపిక చేసుకుందని మనకి తెలియదు. గ్లోబలైజేషన్ వల్ల భారతదేశానికీ జపాన్, ఇండోనేషియా, ధాయ్ లాండ్, సింగపూర్, వియత్నాం, మొదలైన ఆగ్నేయాసియా దేశాలకూ మధ్య 2009 ఆగస్టులో ఫ్రీట్రేడ్ (FTA)అగ్రిమెంటయ్యింది. దీనిప్రకారం వ్యవసాయోత్పత్తులతో సహా 400 రకాల వస్తువులను తయారీదారులు నేరుగా ఆయా దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఇందుకు నౌకావాణిజ్యాన్ని వృద్ధిచేసుకుంటే కోస్తా ఆంధ్రా తీరమంతా ఓడరేవులైపోతుంది. ఈ పని ఇప్పటికే మొదలయ్యింది. విశాఖరేవు విస్తరణ జరుగుతోంది. కాకినాడ రేవునుంచి ఎగుమతి దిగుమతులు పెరుగుతున్నాయి. మచిలీపట్నం రేవుని పునరుద్ధరించవలసివుంది. వోడరేవు-నిజాంపట్నం-కృష్ణపట్నం (వాన్ పిక్) రేవులకు స్ధలం కేటాయింపు వివాదంలో పడింది. ఇవన్నీ క్లియర్ అయితే పెద్ద ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తయారౌతుంది. ఈ రేవులనుంచి ఇప్పటికే వున్న 5 వనెంబరు జాతీయరహదారికి, దానికి సమాంతరంగా వున్న రైల్వేమార్గపు స్టేషన్లకీ విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అప్రోచ్ మార్గాలు వేసుకుంటే కోస్తాఆంధ్రతీరం ప్రపంచానికి 24 గంటల దూరానికి దగ్గరౌతుంది. గత ఐదు వందల సంవత్సరాలుగా సాగరతీర నగరాలలోనే అభివృద్ధి,విజ్ఞానం, నాగరికతలు పుట్టి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలన్నిటికీ సాగరతీరం ఒక సహజ వరంగా ఉంది. న్యూయార్క్, బోస్టన్, లాస్ ఏంజెల్స్, రోటెర్డామ్, లండన్, సెయింట్ పీటర్స్ బర్గ్, లిస్బన్, కైరో, ఇస్తాంబుల్, హాంకాంగ్, సింగపూర్, దుబాయి, షాంఘై, ముంబై, కోల్కతా, చెన్నై మహానగరాలే ఇందుకు నిదర్శనం. ఈ నగరాలన్నీ తమ పోషక ప్రాంతాల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. ఇదంతా విభజన సమస్యవల్ల జరుగుతున్నది కాదు చాలాకాలంగా నత్తనడక నడుస్తున్నదే. న్యూస్ టివిలు పేపర్లు ‘వాన్ పిక్’ కుంభకోణానికి మాత్రమే ప్రాధాన్యత యిచ్చాయి. ఓడరేవులకు అనుబంధ పరిశ్రమలకోసం ఏర్పాటు చేసిన సెజ్ లలో కూడా లొసుగులకు మాత్రమే ప్రాధాన్యత యిచ్చిన మీడియా అవిసజావుగా వుంటే కలిగే ప్రయోజనాలగురించి ప్రజలకు వివరించలేదు. చూసే దృక్పధాన్ని బట్టే విషయం కనబడుతుంది. తెలిసిన వివరాలను బట్టే దృక్పధం వుంటుంది. పాలకుల పారదర్శకతను బట్టే వివరాలు ప్రజలకు తెలుస్తాయి. అంతర్జాతీయ కోణం నుంచి చూస్తే విశాఖ ప్రాధాన్యత ఎంతో ఉన్నతంగా కనబడుతుంది. ఆ మేరకు విశాఖతో సహా ఏనగరాన్నైనా అభివృద్ది చేసుకోవడంలో ప్రజల్ని మోటివేట్ చేయడం, కష్టనష్టాలకు న్యాయమైన మానవీయమైన సహకారం ఇవ్వడం చాలా ముఖ్యం. పారదర్శకత లేకుండా ఇదంతా అసాధ్యమని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆచరించాలి! మైండ్ సెట్ మారిపొమ్మంటే మారిపోదు. మార్చడానికి పెద్ద ప్రయత్నమే చెయ్యాలి!