జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్లడం దుర్లభంగా కనిపిస్తోంది. ఆయనను అడ్డుకునేందుకు అందరూ తిరుమల రావాలని పెద్ద ఎత్తున హిందూ సంస్థలు, ఇతరులు పిలుపునిస్తున్నారు. ఆయన అన్యమతస్తుడని ..శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి పాపంమూటగట్టుకున్నారని ఇప్పుడు ఆయన డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా రుబాబుగా దర్శనానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని వారంటున్నారు. స్వాములు కూడా ఇదే చెబుతున్నారు. జగన్ తిరుమలకు వెళ్లకూడదని.. వెళ్లాలనుకుంటే.. తాము అడ్డంగా పడుకుంటామని తమ పై నుంచి కార్లను తీసుకెళ్లాలని కొంత మంది స్వాములు అంటున్నారు.
ఇటీవల జగన్ ఇంటిపై బీజేపీకి చెందిన యువ కార్యకర్తలు కాషాయం చల్లారు. వారంతా ఇప్పుడు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. పిలుపునిచ్చిన వారు కాకుండా.. ఇంకా అనేక మంది జగన్ తిరుపతికి వస్తే అనూహ్యమైన నిరసన తెలిపేందుకు సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఇంటలిజెన్స్ పోలీసులు కూడా అప్పటికే అప్రమత్తయ్యారు. సున్నితమైన మత రాజకీయ అంశం కావడంతో.. పోలీసులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
జగన్ శుక్రవారం సాయంత్రం తిరుమలకు చేరుకుని.. శనివారం ఉదయం.. శ్రీవారిని దర్శించుకుంటారని చెబుతున్నారు. ఆయన కాలి నడకన వెళ్తారు అన్నది ప్రచారం మాత్రమేనని.. ఆయన నేరుగా కారులో తిరుమలకు వెళ్తారని అంటున్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా శ్రీవారి దర్శనానికి వెళ్తే పెద్ద ఎత్తున ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామాల కారణంగా జగన్ పర్యటన ఉంటుందా ఉండదా అన్నది కూడా డౌట్ గా మారింది.