ఈవారం బాక్సాఫీసు దగ్గర సినిమాల జాతర జరిగింది. ఒకేసారి ఐదు సినిమాలు వరుస కట్టాయి. ఇజం, శంకర, నందిని నర్సింగ్ హోమ్, తను వచ్చెనంట, ఎల్ 7… ఇలా ఏ థియేటర్లో చూసినా కొత్త బొమ్మ తళతళలాడుతూ కనిపిస్తోంది. మరి ఈ 5 సినిమాల్లో ప్రేక్షకుల మనసు గెలుచుకొన్నది ఏది? ఏ సినిమాకి రివ్యూలొచ్చాయి? దేనికి డబ్బులొస్తున్నాయి? ఒక్కసారి పరిశీలిస్తే..
ఈ వారం 5 సినిమాలొచ్చినా అందరూ మాట్లాడుకొన్నది మాత్రం ఇజం గురించే. పూరి భవిష్యత్తుని నిర్ణయించే చిత్రమిది. కల్యాణ్ రామ్ పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుందా, రాదా? అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకొన్నారు. దాదాపు పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులనే కాదు, అభిమానుల్నీ నిరుత్సాహపరిచింది. ఒక్క క్లైమాక్స్ మినహాయిస్తే.. ఎక్కడా పూరి తనదైన ముద్ర వేయలేకపోయాడు. ఇజంలో పూరి ఇజమో, కల్యాణ్ రామ్ ఇజమో కనిపిస్తుందనుకొంటే, అదే పాత చింతకాయ్ పచ్చడి స్టోరీ ఒకటి వండేసి వడ్డించేశాడు. దాంతో ఈ సినిమాని విమర్శకులు మరో ఫ్లాప్ కింద జమ కట్టేశారు. ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీసు దగ్గర రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన శంకర.. ఎట్టకేలకు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోనూ విషయం లేదని తేలిపోయింది. మంచి కథ దొరికినా.. దాన్ని సరిగా ఎలివేట్ చేయలేక దర్శకుడు చతికిల పడ్డాడు. ఎల్ 7… మరో రొటీన్ హారర్ సినిమాగా తేల్చేశారు. రేష్మి గ్లామర్‌ని నమ్ముకొన్న తను వచ్చెనంట… ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేకపోయింది. ఇక ఎలాంటి అంచనాలూ లేకుండా విడుదలైన నందిని నర్సింగ్ హోమ్ మాత్రం… `బాగానే ఉంది` అనే టాక్ తెచ్చుకొంది. ఈవారం విడుదలైన 5 సినిమాల్లో కాస్త పాజిటీవ్ టాక్ వచ్చింది నందినికే. కామెడీ వర్కవుట్ అయిపోవడంతో లాజిక్కులు లేకపోయినా… నందిని గట్టెక్కేసింది. అయితే ఈ 5 సినిమాల్లో కాస్తో కూస్తో వసూళ్లు దక్కతోంది మాత్రం ఇజంకే. అయితే అది దాని బడ్జెట్‌కి సరిపోదు. మిగిలిన నాలుగు సినిమాకీ కనీస ఓపెనింగ్స్ లేకుండా పోయాయి. మొత్తానికి టాక్ పరంగా చూసుకొన్నా, వసూళ్ల పరంగా లెక్కేసినా.. ఈ 5 సినిమాలూ నిరాశ పరిచినట్టే.