హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న టీఆర్ఎస్, టీడీపీ పార్టీల ఎంపీలను వారి ప్రత్యర్థిపార్టీలకు చెందిన నేతలు పిల్లులతో పోల్చిన వైనం ఇవాళ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ ఎంపీలను కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్, టీడీపీ పార్టీ ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు పిల్లులతో పోల్చారు. అయితే ఇది వీరిద్దరూ అనుకుని చేసిన విమర్శకాకపోవటం, కాకతాళీయంగానే జరగటం విశేషం. మధుయాష్కీ ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైకోర్ట్ విభజనపై పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని ప్రగల్భాలు పలికిన టీఆర్ఎస్ ఎంపీలు వెంకయ్యనాయుడు బెదిరిస్తే పిల్లుల్లా కూర్చున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ అవసరాలకోసం ప్రధాని అడుగులకు మడుగులొత్తటం మానుకోవాలని హితవు పలికారు.
మరోవైపు జగన్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశంపార్టీ ఎంపీలు ఢిల్లీలో పిల్లుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడాదిన్నరకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదాకోసం ఎందుకు పట్టుబట్టలేదని అడిగారు. ప్రత్యేక హోదా తప్ప ప్రత్యేక ప్యాకేజిలను అంగీకరిస్తే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు. ప్రత్యేకహోదాపై చర్చించేందుకు ఏపీ అసెంబ్లీని ప్రత్యేకంగా ఎందుకు సమావేశపరచటంలేదని అడిగారు.