ఎన్ని ఫ్లాపులిచ్చినా… తనపై నిర్మాతలకు నమ్మకాన్ని కలిగించడంలో పూరి జగన్నాథ్ దిట్టే అనుకోవాలి. ఏం నమ్ముతారో, ఎలా నమ్ముతారో, పోకిరి కథని తిరగేసి, మరగేసి చెప్పినా కోట్లు కురిపిస్తారు. నిర్మాతల్ని పట్టుకొనే పాఠాలు పూరినే అడిగి తెలుసుకోవాలి. అయితే అలాంటి పూరికి కూడా యమర్జెంటుగా ఓ నిర్మాత కావాలిప్పుడు. పూరి తన తనయుడు ఆకాష్ పూరితో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయిపోయింది. అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్తుంది. కానీ.. ఇప్పటి వరకూ నిర్మాతే దొరకలేదు. ఈ సినిమా ఎవరికి తగిలిద్దామా అని పూరి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడిప్పుడు. పైసా వసూల్ హిట్టయితే.. పూరికి ఈ వెదుకులాట తప్పేది. కానీ ఆ సినిమాకి నష్టాలొచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దాంతో.. నిర్మాతలెవరూ పూరితో సినిమా చేయడానికి ధైర్యం చేయడం లేదు. పైగా ఇందులో హీరో ఎట్రాక్షన్ కూడా లేదాయె. పూరి ఫేమ్ చూసి.. సినిమా టికెట్ తెగాలి. అందుకే…. ఈ సినిమా వరకూ నిర్మాతలంతా పూరిని లైట్ తీసుకొన్నట్టే కనిపిస్తోంది. ఏ నిర్మాతా ముందుకు రాకపోతే, పూరి తన సొంత బ్యానర్లోనే ఈ సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈ సినిమాకి ఓ తమాషా టైటిల్ అనుకొంటున్నాడు పూరి. దాన్ని త్వరలోనే రివీల్ చేస్తాడట. టైటిల్ చూసైనా నిర్మాతలు టెమ్ట్ అవుతారని పూరి భావిస్తున్నాడు. ఇదీ వర్కవుట్ కాకపోతే సొంత డబ్బులు బయటకు తీయాల్సిందే.