పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. సినిమాకి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు బన్నీ. ఐతే ఈ కృతజ్ఞతలు తెలియజేసే క్రమంలో ఆయనకు చాలా కీలకమైన పేర్లు గుర్తుకు రాలేదు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే క్రమంలో ముఖ్యమంత్రి పేరుని మర్చిపోయారు. కాస్త ఆగి నీళ్ళుతాగి మళ్ళీ పేరు చెబుతూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.
అలాగే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ పేరు కూడా బన్నీకి ఫ్లోలో రాలేదు. కాసేపు ఆగి యాంకర్ తో మాట్లాడి మళ్ళీ పూర్తి పేరుని గుర్తు చేసుకుని చెప్పారు. ఈ రెండు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మిగతా స్పీచ్ అంతా సాఫీగానే సాగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగింది. ఇక పుష్ప క్రిడెట్ మొత్తాన్ని దర్శకుడు సుకుమార్ కి ఇచ్చారు బన్నీ. దేశంలోని అన్ని సినీ పరిశ్రమలకు థాంక్స్ చెప్పారు. పుష్ప చాలా పెద్ద స్థాయికి వెళుతుందని, తెలుగు సినిమాకి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుందనే నమ్మకం వుందని చెప్పారు బన్నీ.