తెరాస-వైకాపాల మధ్య ఏదో రహస్య అనుబందం ఉందనేది బహిరంగ రహస్యమే. దానిని వైకాపా చాలా సార్లు రుజువు చేసి చూపించింది కూడా. తెరాస కూడా ఏనాడూ వైకాపాని గట్టిగా విమర్శించిన దాఖలాలు లేవు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పోటీ చేసేందుకు వైకాపాకి అభ్యర్ధులు కోరవడటంతో బరిలో నుంచి తప్పుకొంది. బరిలో నుంచి తప్పుకొన్నప్పటికీ తెరాస గెలుపు కోసం అది యధాశక్తిగా కృషి చేస్తూనే ఉందని చెప్పవచ్చును.
ఆ పార్టీకి చెందిన సాక్షి మీడియాలో వస్తున్న వార్తలు, విశ్లేషణలను గమనించినట్లయితే ఆ సంగతి అర్ధం అవుతుంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తెరాస నేతల కార్యక్రమాల గురించి, వారి ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, ఎన్నికల ప్రచారం, షెడ్యూల్, మేనిఫెస్టో…ఇలాగ తెరాసకు సంబందించి ప్రతీ చైనా పెద్ద విషయాలనీ తన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురిస్తూ, ప్రసారం చేస్తూ తెరాసకు ఉడతాభక్తిగా సహాయపడుతోంది. అలాగే తెరాస మేనిఫెస్టో విడుదల, మంత్రి కె.టి.ఆర్. ప్రచార షెడ్యూల్, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ వివరాల గురించి ఈ రోజు సంచికలో ప్రచురించింది.
అలాగని తన ప్రియశత్రువు తెదేపాను అది విస్మరించలేదు. ఆ పార్టీలో లుకలుకల గురించి, పార్టీని వీడుతున్నవారి గురించి, ఆ కారణంగా తెదేపా ఎదుర్కొంటున్న దుస్థితి గురించి సవివరంగా ప్రచురిస్తూ దానిపై ప్రతీకారం తీర్చుకొంటోంది. ఈ రోజు సంచికలో “గ్రేటర్ ఎన్నికలలో చంద్రబాబు ప్రచారంపై నీలి నీడలు” పేరిట ప్రచురించిన ఒక వార్తలో “చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొన్నట్లయితే తెలంగాణా ఓట్లు పడవని బీజేపీ భయపడుతోందని, అందుకే బీజేపీ అభ్యంతరాలను, తెలంగాణా ఓటర్ల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రచార ప్రణాళిక మారే అవకాశం ఉందని” ఎవరో తెదేపా నేత చెప్పినట్లు వ్రాసింది.
రాజకీయపార్టీలకు మీడియా వత్తాసు పలకడం, వాటి దృక్కోణంలో నుంచే వార్తలు, కధనాలు ప్రచురించడం, వ్యతిరేకిస్తున్న పార్టీలకి వ్యతిరేకంగా వ్రాయడం కొత్తేమీ కాకపోయినా, దాని వలన పత్రికా విలువలు నానాటికీ ఇంకా దిగజారిపోతుంటాయి.