హైదరాబాద్: కందిపప్పు ధర ఆకాశాన్ని తాకటంతో, పలువురు వ్యాపారులు అక్రమాలకు దిగారు. చౌకగా లబించే టాంజానియా కందిపప్పును మార్కెట్ లోకి దించి కిలోను రు.85 నుంచి 90 మధ్య అమ్ముతున్నారు. అసలు కందిపప్పు కిలో రు.210 ఉండగా, సగం కన్నా తక్కువ రేటుకే ఈ కందిపప్పు లభిస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు దీనినే కొని వాడుకుంటున్నారు. ఈ పప్పు వాడకంవల్ల వచ్చే అనర్థాలపై అధికారులకుకూడా ఎటువంటి అవగాహన లేకపోవటంతో టాంజానియా కందిపప్పు వ్యాపారం యధేచ్ఛగా కొనసాగుతోంది.
గతంలో టాంజానియా కందిపప్పును కిలో రు.40 నుంచి రు.50 మధ్య విక్రయించేవారు. ఇప్పుడు అసలు కందిపప్పు 210కి చేరటంతో దానినికూడా పెంచేశారు. ప్రస్తుతం హోటల్, మెస్‌ల యజమానులు 75 శాతం మంది టాంజానియా పప్పునే ఉపయోగిస్తున్నారంటున్నారు. ఉప్పు, కారం, నూనె కలిసిన రుచిలో వీటి నాణ్యత అంతగా తెలియదని చెబుతున్నారు. టాంజానియ కందిపప్పును భారీ ఎత్తున విక్రయించి లాభాలు గడించటానికి హైదరాబాద్ నుంచి కర్నూలు, నంద్యాల, ఆదోని, ప్రాంతాలకు దళారీలను రంగంలో దించి సరకు పంపుతున్నారు.