భారతీయుల దృష్టిలో ఆట అంటే క్రికెట్ ఒక్కటే. అంతగా క్రికెట్ పిచ్చి చాలా మంది భారతీయులను ఆవహించింది. అలాంటిది, క్రికెట్ తో సమానంగా కబడ్డీ లైవ్ చూడటమంటే మాటలా. ప్రో కబడ్డీ ఈ అద్బుతాన్ని సాధించి చూపింది. 8 జట్లు ఎంటర్ టైన్ మెంట్ కు పరాకాష్టగా నెలరోజులకు పైగా భారతీయులను ఉర్రూతలూపాయి. ముంబైలో మొదలై, ముంబైలో ముగిసిన ప్రో కబడ్డీ రెండో సీజన్ ఐపీఎల్ ను సవాల్ చేసింది.
చాంపియన్ గా నిలిచిన ముంబై జట్టుకు కోటి రూపాయల నగదు బహుమతి. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఇక, రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు జట్టుకు 50 లక్షలు, మూడో స్థానం పొందిన హైదరాబాద్ కు 30 లక్షలు, నాలుగో స్థానంలో ఉన్న పాట్నా జట్టుకు 20 లక్షల నజరానా లభించింది. కబడ్డీలో ఇంత భారీ స్థాయిలో నగదు బహుమతి ఊహకు అందని విషయం. కానీ అది నిజమైంది. కబడ్డీకి కార్పొరేట్ లుక్ ఇచ్చి, ఈ ఆటకు ప్రాచుర్యం కల్పించడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. గత ఏడాది మొదటి సీజన్ అంతగా ప్రాచర్యం పొందలేదు.
ఈసారి మాత్రం సీన్ మారింది. సెలెబ్రిటీలే కాదు, ప్రేక్షకులూ మౌత్ పబ్లిసిటీతో ప్రో కబడ్డీకి మంచి ప్రాచుర్యం కల్పించారు. ఎక్కడ పోటీలు జరిగినా స్టేడియంలు కిటకిటలాడిపోయాయి. సీట్లన్నీ నిండిపోయాయి. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ కామెంటరీ చెప్పడం, మా మూవీస్ వంటి ప్రాంతీయ చానల్స్ల లోనూ ప్రత్యక్ష ప్రసారం కావడం ప్లస్ పాయింట్లు. రోజూ రాత్రి 8 అయిందంటే జనం టీవీలకు అతుక్కుపోయి కబడ్డీ మ్యాచ్ లు చూశారు. ఆ సమయంలో వచ్చే సీరియల్స్, గేమ్ షోలను పట్టించుకోలేదు. క్రికెట్ కాకుండా మరో ఆటను జనం ఇంతగా ఆదరించడం ఆశ్చర్యకరమైన విషయం.
సినీ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ జట్టుకు యజమాని. అతడితోపాటు సైఫ్ అలీఖాన్, కత్రినా కైఫ్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తదితర సెలెబ్రిటీలు ఫైనల్ మ్యాచ్ కు తరలివచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా ఫైనల్ మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చారు. కబడ్డీని ఆదరించిన ప్రేక్షకులను అభినందించారు. కొంత కాలంగా క్రికెట్ తోపాటు టెన్నిస్, బ్యాడ్మింటన్ కు కొంత ఆదరణ పెరిగింది. చెస్ కూడా ప్రాచుర్యం పొందింది. వీటన్నింటినీ కబడ్డీ అధిగమించింది. పల్లెటూరి ఆటకు కార్పొరేట్ సొబగులు అది సూపర్ హిట్ చేశారు. అలాగే మిగతా భారతీయల క్రీడలూ ఒక్కొక్కటిగా ప్రాచుర్యం పొందే రోజు రావాలని కోరుకుందాం.