తెలంగాణ రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో అనేక మార్పులు జరగబోతున్నాయి. వయో పరిమితిని ఐదేళ్లు సడలించబోతున్నారు. చాలా కాలంలో ఉద్యోగ నియామకాలు లేవు కాబట్టి యువత ఈ మినహాయింపును కోరుకుంటోంది. అయితే, పోలీసుల నియామకంలో అతి ముఖ్యమైన ఐదు కిలోమీటర్ల పరుగును తొలగించాలని మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసింది. ఈ పరుగును పూర్తి చేయలేక గతంలో కొందరు యువకులు ఇబ్బంది పడ్డారు. బహుశా ఆ కారణంగానే ఈ సిఫార్సు చేసి ఉంటారు.
పోలీసు అంటే శాంతిభద్రతలను కాపాడాలి. నేరస్తులను పట్టుకోవాలి. పారిపోతున్న నేరస్తులను పట్టుకోవాలంటే కనీస ఫిట్ నెస్ ఉండాలి. అందుకే పోలీసు నియామకాల్లో పరుగు పోటీ కచ్చితంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇది అమలవుతోంది. కొందరు యువకులు తమ శక్తి ఏమిటో తెలుసుకోకుండా వచ్చి ఇబ్బంది పడ్డారని ఈ పోటీనే ఎత్తేస్తే, రేపు వాళ్లు పోలీసులైన తర్వాత కళ్ల ముందు దొంగ పారిపోతున్నా పట్టుకోలేక పోవచ్చు. అప్పడు మనమే అంటాం. వీళ్లేం పోలీసులు, ఆ మాత్రం ఫిట్ నెస్ లేకుండా ఎలా నియామించారు అని.
ఎవరైనా ఒక ఉద్యోగం కోసం ప్రయత్నించేటప్పుడు దానికి తగిన అర్హతల కోసం ప్రయత్నిస్తారు. ఐఐటీ కావాలనుకునే వారు ఐదో తరగతినుంచే కోచింగ్ తీసుకుంటారు. డాక్టర్ కావాలనుకునే వారు రెగ్యులర్ కాలేజీతో పాటు స్పెషల్ కోచింగ్ తీసుకుంటారు. వారనికో మాక్ టెస్టు రాసి తమ సత్తా ఏమిటో పరీక్షించుకుంటారు. అలాగే పోలీసు ఉద్యోగానికి వచ్చే వారు ఐదు కిలోమీటర్ల పరుగెత్తగలరో చూసుకోకుండా రావడం సరికాదు. ఆ సత్తా ఉంటేనే పోలీసు ఉద్యోగానికి రావాలి. అంతేగానీ, ఫిట్ నెస్ పరీక్షనే ఎత్తివేయడం శాంతిభద్రతల పరిరక్షణకు విఘాతమే. ఇటీవల విశాఖ పట్నంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ సందర్భంగా పరుగు పందెంపై కొందరు విమర్శలు చేశారు. అక్కడ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడితే వాటిని సరిచేసుకోవాలి. అసలు ఫిట్ నెస్ పరీక్షే వద్దంటే ఒప్పుకొనేది లేదంటూ ఆర్మీ వారు పరుగు పోటీ యధావిధిగా నిర్వహించారు.
నేరస్తులను పట్టుకోవాలంటే కనీస స్థాయి ఫిట్ నెస్ ఉండి తీరాలి. అయితే ఐదు కిలోమీటర్లకు బదులు ఈ దూరాన్ని కొంత తగ్గించాలని కొందరు సూచిస్తున్నారు. అది సమంజసమో కాదో నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పోలీసు నియామకాల సందర్భంగా ఒకటిన్నర మైలు పరుగు పోటీ పెడతారు. కాబట్టి ఐదు కిలోమీటర్ల కన్నా కాస్త తక్కువ దూరం పరుగు పోటీ సబబా అనేది యోచించ వచ్చు. అంతేగానీ అసలు ఫిట్ నెస్ పరీక్షే లేకపోతే, శారీరక పటుత్వం లేని వారు పోలీసులయ్యే అవకాశం ఉంది. ఈ సిఫార్సుపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూద్దాం.