హైదరాబాద్: బాహుబలి రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ బయటకొస్తున్న ఆ చిత్ర విశేషాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేవలం పోరాట సన్నివేశాల షూటింగే 220 రోజులపాటు చేసినట్లు హీరో ప్రభాస్ వెల్లడించారు. అసలు ఈ సన్నివేశాల షూటింగ్‌కు ముందు ఆరునెలలపాటు తాను గుర్రపు స్వారీ, కొండలు ఎక్కటం, కిక్ బాక్సింగ్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. తమకు శిక్షణ ఇవ్వటానికి వియత్నాంనుంచి కొంతమంది నిపుణులను నిర్మాతలు రప్పించారని, రోజూ తాను ఐదారు గంటలు మార్షల్ ఆర్ట్స్, కత్తియుద్ధం ప్రాక్టీస్ చేసేవాడినని చెప్పారు. కథలోని పాయింట్‌ను రాజమౌళి 3-4 సంవత్సరాల క్రితం నాలుగు లైన్లలో చెప్పినప్పటికీ, అసలు ప్రధాన పాత్రలు, మిగతా వివరాలను షూటింగుకు ముందే చెప్పాడని తెలిపారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామికావటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రభాస్ చెప్పారు. అంత పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీ ఈ ప్రాజెక్టులోకి రావటాన్ని తాను మొదట నమ్మలేదని అన్నారు. కరణ్ రాకతో బాలీవుడ్లో ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చిందని ప్రభాస్ చెప్పారు. తమ సహనటీనటులలో తమన్నా బాగా కష్టపడిన వ్యక్తి అని, రాణా అందరినీ నవ్విస్తూ ఉండేవాడని తెలిపారు. బాలీవుడ్ చిత్రం చేస్తానని అన్నారు. షారుక్, సల్మాన్ ఇద్దరూ తనకు ఇష్టమని, దబాంగ్ ఫేవరెట్ చిత్రమని ప్రభాస్ చెప్పారు.