భారత్ మీడియాకి ప్రధాని నరేంద్ర మోడి ఎన్నడూ చిక్కడు దొరకడు కానీ విదేశాలకు వెళ్లి అక్కడ బ్రిటన్ మీడియాకి దొరికిపోయారు. భారత్ లో పెరుగుతున్న మత అసహనం గురించి ఆయనను ప్రశ్నించేందుకు భారత్ మీడియాకు ఎన్నడూ అవకాశం దొరకలేదు. నిజానికి దొరకలేదు అనడం కంటే ఇవ్వలేదు అనడమే న్యాయంగా ఉంటుంది. కానీ బ్రిటన్ మీడియా అడిగిన ఈ ప్రశ్నకు ప్రధాని నరేంద్ర మోడి జవాబు చెప్పకుండా తప్పించుకోలేకపోయారు. “దేశంలో ఉన్న 125 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదనే మా ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో నివసిస్తున్న ప్రతీ ఒక్కరికీ రక్షణ కల్పించవలసిన బాధ్యత మా ప్రభుత్వానిదే.125 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒకచోట ఒకటో రెండో మూడో ఇటువంటి సంఘటనలు జరుగుతుండవచ్చును. అవి తీవ్రమయినవా…లేకపోతే సాధారణ సంఘటనలా..?అని ఆలోచించకుండా చట్టం తనపని తను చేసుకొని పోతుంటుంది,” అని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు.