శాసనసభ ప్రివిలేజ్ కమిటీ రోజా వ్యవహారంలో తన నివేదికను శాసనసభకు సమర్పించింది. ఆమెను ఏడాదిపాటు సభనుంచి సస్పెండ్ చేయాలంటూ ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆమె ఏడాది సస్పెన్షన్ మరింత సాధికారికంగా అమల్లోకి రానుంది. ఎమ్మెల్యే అనిత పట్ల వ్యవహరించిన వైఖరి విషయంలో రోజా మీద ఈ చర్య తీసుకోవడానికి ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేయడం విశేషం. పైగా ఎమ్మెల్యేగా పొందగల అలవెన్సులు అన్నిటికీ కోత విధిస్తూ సస్పెన్షన్ అమలు చేయాలంటూ ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేసింది. దీంతో శీతాకాల సమావేశాల్లో విధించిన ఏడాది సస్పెన్షన్ను కొట్టివేస్తూ హైకోర్టునుంచి రోజా తెచ్చుకున్న ఉత్తర్వుల వల్ల ఫలితం దక్కే అవకాశం కనిపించడం లేదు. కొత్తగా ఆమె మీద మళ్లీ ఏడాది సస్పెన్షన్ వేటు పడనుంది.
ప్రివిలేజ్ కమిటీ భేటీ తరువాత.. సస్పెన్షన్లకు సంబంధించి రకరకాల వార్తలు వచ్చాయి.రోజాతో పాటు కొడాలి నానిని కూడా ఏడాది పాటు సస్పెండ్ చేయాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీ సిఫారసు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే అచ్చెన్నాయుడు మీద తాను చేసిన కామెంట్లకు సంబంధించి, ఆ తర్వాత ఆయనను విడిగా కలిసి క్షమాపణ చెప్పినట్లుగా కొడాలి నాని ప్రివిలేజ్ కమిటీకి నివేదించుకున్నారు. బహిరంగంగా ఆ విషయాన్ని ప్రకటించారు కూడా! ఆ ప్రభావంతో ఆయన మీద చర్య తప్పిపోయినట్లుగా అనిపిస్తున్నది.
మొత్తానికి రోజా ఎపిసోడ్ ఆమెకు సంబంధించినంత వరకు ఇబ్బందికరంగానే ఒక కొలిక్కి వచ్చింది. తొలుత స్పీకరు ఏడాది సస్పెండ్చేస్తే.. రూల్సుకు విరుద్ధం అని, అంత కాలం సస్పెన్షన్కు నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు లేదని ఆమె కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు తీసుకువచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఎదురెత్తులు వేసింది. ప్రతివ్యూహం రచించింది. ఎమ్మెల్యే అనితతో కొత్తగా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయించి ప్రివిలేజ్ కమిటీ భేటీలో రోజా మీద వేటు వేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. రోజా చేసిన తప్పు ఏంటంటే.. తాను ప్రివిలేజ్ కమిటీ భేటీకి హాజరు కాకపోవడం ! దాన్ని ఆమె ఎవాయిడ్ చేయడం వల్ల కమిటీ నిర్ణయం తీసేసుకున్నది.
ఇక ప్రివిలేజ్ కమిటీ దర్యాప్తు, విచారణ మరియు నివేదిక పర్యవసానంగా తీసుకోబోయే ఏడాది సస్పెన్షన్ విషయంలో కోర్టు కూడా జోక్యం చేసుకోకపోవచ్చునని పలువురు విశ్లేషిస్తున్నారు. కొడాలి నాని క్షమాపణ చెప్పినప్పటికీ ఆయన విషయంలో శాసనసభ నిర్ణయం తీసుకోవచ్చునంటూ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయాన్ని సభకే వదిలివేయడం విశేషం.