రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. లలిత్ మోడీ వివాదం తర్వాత జరిగిన ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశించిన కాంగ్రెస్ పార్టీకి నిరాశే ఎదురైంది. మొత్తం 129 మున్సిపాలిటీల్లో బీజేపీ 67 పట్టణాల్లో పాగా వేసింది. మెజారిటీ వార్డులను గెల్చుకుంది. కాంగ్రెస్ 49 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లు, ఇతర పార్టీలు పాగా వేశాయి.
ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోల్ పూర్, ఝలావర్ లో బీజేపీ పరాజయం పాలైంది. లలిత్ మోడీ వివాదం ప్రభావం వసుంధరపై పడిందని పరిశీలకులు భావిస్తున్నారు. వసుంధర, దుష్యంత్ లకు లలిత్ మోడీతో ఆర్థిక సంబంధాలున్నానే ఆరోపణలు ప్రజలపై ప్రభావం చూపాయని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గతంలో 49 మున్సిపాలిటీల్లో అధికారంలో ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 67 కు పెరిగిందని, తమ పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అధ్యక్షుడు అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారు. ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఓట్ల శాతం విషయానికి వస్తే బీజేపీకి నిరాశ తప్పదు. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 55 శాతం ఓట్లు సాధించింది. ఈసారి అది 37 శాతానికి పడిపోయింది. అయితే, ఆనాడు దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏకు వ్యతిరేకంగా, మోడీకి అనుకూలంగా ప్రభంజనం వీచింది. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కకుండా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఆనాటి ఓట్ల శాతంతో ఇప్పుడు పోల్చడం సరికాదంటున్నారు కమలనాథులు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై పట్టణ ప్రాంత ప్రజలు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా ఉందని వారంటున్నారు.
మరోవైపు, ఇటీవల మధ్య ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కటి తప్ప మిగతా కార్పొరేషన్లన్నింటినీ కైవసం చేసుకుంది. వ్యాపం కుంభకోణంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ సమయంలో బీజేపీ మంచి ఫలితాలు సాధించడం బీజేపీకి, చౌహాన్ కు పెద్ద ఊరటనిచ్చింది. అయితే రాజస్థాన్ లో మాత్రం వసుంధర రాజీనామాకు కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎెక్కువ సీట్లు గెలిచినా, వసుంధర, ఆమె తనయుడి నియోజకవర్గాల్లోని ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి. అంటే లలిత్ మోడీ వివాదంతో ప్రజలు వసుంధరకు వ్యతిరేకంగా ఉన్నట్టు అర్థమవుతోందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. వసుంధర రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.