విజయవాడ వరద బాధితుల కోసం ప్రపంచంలోని తెలుగు వాళ్లంతా అండగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి సహాయనిధికి వారు ఇచ్చిన మొత్తం రూ. నాలుగు వందల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అంత పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయా అని. మొత్తంగా బాధితులకు ఆరు వందల కోట్లు పంపిణీ చేశారు. అందులో నాలుగు వందల కోట్లు ప్రజలు చేసిన సాయమే.
ప్రజలు ఎదుర్కొన్న ఓ కష్టానికి తోడుగా ప్రజలు ఇంత భారీ స్థాయిలో విరాళం ఇవ్వడం ఇదే మొదటి సారి. గతంలో కరోనా సమయంలో బడా పారిశ్రామిక వేత్తల నుంచి అలాగే నియోజకవర్గాల నుంచి టార్గెట్ పెట్టి మరీ విరాళలు సేకరించారు జగన్ రెడ్డి. వాటిని దేనికి వాడారో తెలియదు కానీ… దొంగ చెక్కులతో కలకత్తాలో డ్రా చేసుకోవడానికి ప్రయత్నించిన అంశం కలకలం రేపింది. దొరికినప్పుడే దొంగలన్నట్లుగా.. అంతకు ముందు ఎన్ని కోట్లకు దండుకున్నారో ఎవరికి తెలియదు. ఆ కేసులో ఎవర్నీ అరెస్టు చేయలేదు. హడావుడి చేసి పక్కన పెట్టేశారు. సీఎంఆర్ఎఫ్ను అప్పటి సీఎంవోలోని పెద్దలే దోచేసుకున్నారని అంటారు. ఆ లెక్కలు ఎవరికీ తెలియదు.
కానీ ఇప్పుడు సీఎంఆర్ఎఫ్కు ప్రతి రూపాయికి లెక్క చూపిస్తున్నారు చంద్రబాబు. ప్రజల కష్టాల్లో ప్రజలు అండగా ఉండేలా.. ఆయన ప్రత్యేక స్ఫూర్తిని ప్రజల్లో నింపారు. ఇది అందరిలోనూ సమైక్యత పెంచుతుంది. కొసమెరుపేమిటంటే ఇలా విరాళాలు తీసుకోవడాన్ని కూడా వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. గతంలో వారు చేసిన పనుల్ని మర్చిపోయి ఇలా చేసేస్తూంటారు. మొత్తంగా.. ఏపీ ప్రజలకు మేమున్నామన్న భావన తోటి ప్రజలే కల్పించారు.