కాల్ మనీ వ్యవహాలాల్లో వున్నఎంతటి వారినైనా వదిలే సమస్యలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన హెచ్చరికకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా కాల్ మనీ వ్యాపారులపై పోలీసు దాడులు మొదలయ్యాయి. ఇదంతా లెక్కల్లోకి రాని బ్లాక్ మనీ కాబట్టి వాస్తవ లావాదేవీలకు, అకౌంట్లలో కనిపించే లావాదేవీలకు ఎక్కడా పొంతన వుండదు.
కాల్ మనీ రుణాలు తీసుకున్నవారు వాటిని తిరిగి చెల్లించనవసరంలేదని స్వయంగా ముఖ్యమంత్రే పిలుపు ఇవ్వడం వల్ల అనేక ప్రాంతాల్లో ప్రజలు తమకు అప్పిచ్చిన వారు అన్ని విధాలా వేధిస్తున్నారని ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. ఈ ఫిర్యాదుల్లో నిందితులు అన్ని నరాజకీయపార్టీలకూ చెందినవారే.
దారుణమైన వడ్డీ వసూలు చేయడం మాత్రమే కాక రుణాలు పొందిన కుటుంబాల స్త్రీలతో వ్యభిచారం చేయించేటంత రాక్షసత్వానికి తెగబడుతున్న మానవమృగాలు విజయవాడలో బయటపడటం, ఆకిరాతకులు అధికారపార్టీ వారై వుండటంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, మహిళలు ఏవగింగుకునేటంత, అసహ్యించుకునేటంత దిగజారిపోయింది.
అన్ని పార్టీల్లోనూ కాల్ మనీ రాక్షసులు వున్నారని ప్రజలకు అర్ధమయ్యేలా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ అంటించుకున్న మురికిని అన్నిపార్టీలకూ పులమవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా దాడుల అసలు ప్రయోజనం ఇదేనన్న విమర్శలు వస్తున్నాయి.
కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వెళ్ళే ప్రోగ్రామ్ పెట్టుకుని విజయవాడ పోలీస్ కమీషనర్ సవాంగ్ రెండునెలలక్రితమే సెలవుకోరి ఇవాళరిలీవ్ అయ్యారు. ముఖ్యమంత్రికి ఇష్టుడైన సురేంద్రబాబు వెంటనే సవాంగ్ బాధ్యతలను స్వీకరించారు. విజయవాడ కాల్ మనీ వ్యాపారుల వొత్తిళ్ళవల్లే ఆయనను సవాంగ్ ను సెలవులో పంపించారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి.
కాల్‌మనీ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు ఎంతటి పలుకుబడి ఉన్నవారైనా కఠినచర్యలు తప్పవని డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. బాధితులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయడంతో పాటు..వడ్డీకి డబ్బులు ఇచ్చి మహిళలను లోబర్చుకున్న వారిపై నిర్భయ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇక సీపీ గౌతమ్ సవాంగ్ సెలవుపై స్పందిస్తూ..నెలరోజుల క్రితమే సెలవు మంజూరైందని..కాల్‌మనీ వ్యవహారం వల్లే ఆయన సెలవుపై వెళ్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు.