ప్రాజెక్ట్ రిపోర్టులో ఏమార్పూ లేకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ లో విజయవాడ మెట్రో రైలు పా్రజెక్టు నిర్మాణం ప్రారంభమౌతుంది. ప్రతీ కిలోమీటర్ దూరానికీ ఒక రైల్వేస్టేషన్ వుండేలా ప్రాజెక్టుని రూపొందించారు. 25 కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డిఎంఆర్సి) సర్వేచేసి ఈ ప్రాజెక్టుని రూపొందించింది. దాన్ని ఆమోదించిన రాష్ట్రప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్నికూడా అదేసంస్ధకు ఖరారు చేసింది. ప్రస్తుతం ఆసంస్ధ, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పేపర్ వర్క్ లోవుంది. ఏడునెలల్లో భూసేకరణ పూర్తి చేసి పని ప్రారంభించడానికి తుది మెరుగులు దిద్దుతోంది.
మెట్రో రైలు ప్రాజెక్టు మొదటిదశ నిర్మాణంలో రెండు కారిడార్లలో 25 స్టేషన్లు ఉంటాయి. మొదటి కారిడార్ పండింట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బందరు రోడ్డులో పెనమలూరు వరకు 12.4 కిలో మీటర్లకు 12 స్టేషన్లు, రెండో కారిడార్ ఏలూరు రోడ్డులో బస్టాండ్, రైల్వేస్టేషన్, నిడమానూరు వరకు 13.6 కిలో మీటర్లలో 13 స్టేషన్లు నిర్మించనున్నారు. రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్కో పిల్లరు విస్తీర్ణం 2.5 మీటర్లు, ప్లాట్ఫారం 13 మీటర్ల ఎత్తులో నిర్మిస్తారు. బెంజిసర్కిల్ వద్ద ఫ్లైవోవర్ నిర్మించే అవకాశం ఉండడంతో అక్కడ రైలు ప్రాజెక్టు ఎత్తు17 మీటర్లకు పెంచారు. 2019కి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేలా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 6,823 కోట్ల రూపాయలని అంచనా వేశారు. అప్పటికి పని పూర్తికాకపోతే ఖర్చు పెరిగిపోతుంది.
ఈ ప్రాజెక్టుకి బందరు, ఏలూరు రోడ్లలో 78 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.ఇందుకు 800 కోట్ల రూపాయల వరకూ అవసరమవుతాయని అంచనా. అంతేగాక భూ సేకరణకు ఏడు నెలలు పడుతుందని భావిస్తున్నారు.
ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25 శాతం చొప్పున భరిస్తున్నాయి. మిగిలిన 50 శాతం నిధులను అప్పుగానే సమకూర్చుకోవాల్సి ఉంది. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, గుజరాత్ రాష్ట్రాల్లో చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం నిర్మాణ వ్యయంలో 50 శాతం నిధులను కేటాయించింది. విజయవాడకు కూడా ఆప్రకారమే కేంద్రం 50 శాతం నిధులు గ్రాంటుగా ఇచ్చేలా ఒప్పిస్తే ఆర్ధిక సమస్యల్లో వున్న రాష్ట్రప్రభుత్వం మీద భారం తగ్గుతుంది.
మెట్రో రైలు ఎలైన్మెంట్ మార్చాలని బందరు, ఏలూరు రోడ్ల వెంబడి ఉన్న స్థలాల యజమానులు కోరుతున్నారు.బందరు, ఏలూరు కాల్వలపైన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని వ్యాపారులు సూచిస్తున్నారు. మెట్రో రైలు ప్రధాన రహదారుల వెంట వెళితేనే నిర్వహణ వ్యయం తిరిగి వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు. బందరు, ఏలూరు కాల్వలపై రైలు ప్రాజెక్టు చేపడితే వ్యయ ప్రయాసలు మినహా ఉపయోగం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మెట్రో రైలు ఎలైన్మెంట్ మార్పుచేస్తే సర్వే పనులు తిరిగి మొదటికి వస్తాయి. ఇందువల్ల ఎలైన్ మెంటు మార్పును ప్రభుత్వం అంగీకరించదు అంటున్నారు!