అధికారంలో వున్న రాజకీయపార్టీలు ప్రజల డిమాండ్ల విషయంలో ప్రభుత్వానికి ప్రజలకూ మధ్య వారధులుగా వుండటంలో ప్రతీసారీ విఫలమైపోతూనే వున్నాయి. ఆర్ధిక సమస్యలు, రాజధాని నిర్మాణభారాలు, హైదరాబాద్ నుంచి ఆఫీసుల్ని తరలించడంలో చిక్కుముళ్ళ మధ్య వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వివాదంలో ఏమీ మాట్లాడవద్దని మంత్రివర్గ సహచరులను తెలుగుదేశం నాయకులను ఆదేశించారు.
నిజానికి ప్రత్యేకహోదా డిమాండు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదికాదు. ప్రజలదే! ప్రత్యేక హోదా అంశానికి ప్రాధాన్యత ఏర్పడటానికి వెంకయ్య నాయుడే కారణం. విభజన బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం, అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆ మేరకు హామీ ఇవ్వడంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే చాలు ఇంకేమీ అవసరం లేదన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ల సమక్షంలో నరేంద్రమోదీ తిరుపతిలో ఎన్నికల సభలో మాట్లాడినపుడు ‘నేను మీ పెద్దకొడుకుని. ఢిల్లీకి మించిన రాజధాని ఇస్తా వెంకయ్యగారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా’ అని నమ్మించారు.
భూస్ధాపితమైపోతున్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిలదొక్కుకోవాలని ముందూ వెనుకా చూసుకోకుండా ఎన్నికలకుముందు మోదీతో సహా బిజెపి నాయకులందరూ ఎడాపెడా అబద్దాలు చెప్పేశారని ఇపుడు లెక్కతేలిపోయింది. ప్రత్యేక హోదా కుదరదని ప్రభుత్వం రెండుసార్లు పార్లమెంటులో ప్రకటించేయడంతో నమ్మకద్రోహంపట్ల ప్రజల్లో ఆవేశ ఆగ్రహాలు రగులుతున్నాయి. ఈ స్ధితిని ప్రతిపక్షాలు వాడుకోవడం లో అన్యాయమేమీలేదు
అయితే కేంద్రాన్ని ఏలుతున్న ప్రభుత్వానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో వున్న పార్టీ వ్యవస్ధ ఏమైపోయిందన్నదే ఆశ్చర్యం! ప్రత్యేక హోదా లేదు సరే ప్రత్యేక పాకేజి ఏమిటి? విరివిగా ఉపాధి అవకాశాలు ఇచ్చేలా పరిశ్రమలు తరలిరావడానికి పన్ను మినహాయింపు వుంటుందా? రాజధానికి నిర్మాణానికి నిధులు ఇస్తారా? లోటుబడ్జెట్టుని పూడుస్తారా? అసలు ప్రత్యేకహోదాకి పాకేజికి తేడా ఏమిటి? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన బాధ్యతలు నిర్వహించ వలసిన బిజెపి గాఢనిద్రలో వున్నట్టుంది. సమావేశాలద్వారా, చర్చాగోష్టులద్వారా, సభలద్వారా ప్రత్యేకహోదా ప్రత్యేక పాకేజీల్లో సాధకబాధకాలును ప్రజల్లోకి తీసుకువెళ్ళవచ్చు. తెలుగుదేశం ఆక్రమించేసుకున్న ఆంద్రప్రదేశ్ లో పునాదులనుంచీ వేళ్ళూనుకోడానికి ఒకవిధంగా ఇది బిజెపికి ఒక అవకాశం!
అధికారంలోకి వచ్చేవరకూ ప్రజల్లో కనిపించి, ఎన్నికల్లో గెలిచాక ప్రజలనుంచి మాయమైపోయే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే. బలమైన సైద్ధాంతిక వుందని ఘనంగా చెప్పుకునే బిజెపికి కాంగ్రెస్ కి ఆట్టే తేడాలేదని ఆంధ్రప్రదేశ్ లో బిజెపి జడత్వం, స్తబ్దత… లెక్కతేల్చేశాయి.