హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు డైలాగ్ వల్లెవేశారు. ఇవాళ హైదరాబాద్లో పార్క్ హయత్ హోటల్లో స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో జరిగిన సదస్సులో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు మున్సిపల్ మంత్రిత్వశాఖ అప్పజెపుతానని ప్రకటించటంపై స్పందించారు. శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెబుతారని, దత్తత తీసుకోవటం అంటే చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళటంకాదని, పని అయ్యేవరకు ఉండటమని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ బాధ్యతను సీఎమ్ తనకప్పగించారని చెప్పారు. గత పదిహేను రోజులుగా హైదరాబాద్లో ఓట్లకోసం అడుగుతూ తాను వాడవాడలా తిరుగుతూ చేసిన హామీలను నెరవేర్చటంకోసం తనకు ఈ బాధ్యత అప్పజెప్పారని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు నగరాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేశారని, దీనికి హైదరాబాద్ భౌగోళిక, సామాజిక పరిస్థితులు ఆయనకు కలిసొచ్చాయని అన్నారు. అయితే ఈ నగరాభివృద్ధికి తానొక్కడినే బాధ్యుడిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ నగరానికి 427 ఏళ్ళ చరిత్ర ఉందని, ఎవరో ఒకరు నిర్మించలేదని, శతాబ్దాలుగా విస్తరిస్తూ వస్తోందని కేటీఆర్ చెప్పారు.