‘గంటా గారూ… మీ పాత పార్టీలో సహచరుడుర సి.రామచంద్రయ్య ఎడా పెడా విమర్శలు గుప్పిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు. వాటికి సమాధానం పార్టీ తరఫున మీ అంతట మీరు చెప్పాలని పూనుకోవాలి కదా’
‘ముద్రగడ పద్మనాభం అంత అసహనంతో ఉన్నాడేమిటి… ఆయన చెప్పినట్టల్లా ప్రభుత్వం నడవాలని అనుకుంటున్నారా… మీరేం చేస్తున్నారు.. ఆయన మాటలకు కౌంటర్ ఇవ్వలేరా?’
‘మందకృష్ణ ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే.. మన వాళ్లు ఎలా ఖండించాలో కూడా మంత్రులకు ఫీడింగ్ ఇవ్వాలా?’
‘నా మీద వైఎస్సార్ కాంగ్రెస్ బినామీ ఆస్తులు, స్వాహాలు అంటూ ఆరోపణలు చేస్తుందా? నాకు అవినీతిని అంటగడతారా.. నా స్వచ్ఛతను బలపరచడానికి మీరంతా పూనుకోవాలి కదా…’
… అచ్చంగా ఇవే వాక్యాలు కాకపోవచ్చు గానీ.. బుధవారం సాయంత్రం నిర్వహించిన మంత్రుల సమావేశంలో చంద్రబాబునాయుడు తన కేబినెట్ సహచరులకు పురమాయించిన సంగతి మాత్రం ఇదే. రాజకీయంగా తన మీద విమర్శలు చేస్తున్న వ్యక్తులు, విపక్షాల మీదకు చెలరేగిపోవాల్సిన బాధ్యత మొత్తం మంత్రులు తీసుకోవాలని.. ఎవరైనా సూచనలు చేసే వరకు ఆగరాదని.. ఎప్పటికప్పుడు ఎదురుదాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని పురమాయించడం తప్ప.. ఆయన మంత్రులతో భేటీలో వారికి ఏమీ చెప్పలేదు.
చంద్రబాబునాయుడు ఒకేరోజు అనేక రకాల చికాకులు చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు తమకు జరుగుతున్న ద్రోహం గురించి మందకృష్ణ చేస్తున్న ఆరోపణలు, మరోవైపు బుధవారం తెల్లవారే సరికి.. సాక్షి దినపత్రిక సెంటర్ స్ప్రెడ్లో అత్యంత బీభత్సమైన కవరేజీతో రాజధాని రూపంలో జరుగుతున్న స్వాహా పర్వం గురించి, వాటి వెనుక చంద్రబాబు బినామీ దందాల గురించి ‘సాక్షి మార్కు’ కథనాలు… బుధవారం రోజునే, ముద్రగడ పద్మనాభం ప్రెస్మీట్ పెట్టి మరీ, చంద్రబాబునాయుడు మంత్రులకు హితబోధ చేయడం విశేషం.
కాపుల రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధతతో ఉందో, వారి సంక్షేమానికి ఎంతగా పనిచేస్తున్నదో మంత్రులు సమష్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు అన్నట్లు సమాచారం. జగన్ కోసమే ముద్రగడ లేఖ రాసినట్లున్నదనే వ్యాఖ్య కూడా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన మంత్రులతో జరిపిన సమావేశం మొత్తం వారిని ప్రతీకార దాడులకు సిద్ధం చేస్తున్నట్లుగానే ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.