ఉస్మానియా జనరల్ ఆస్పత్రి తరలింపును వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. చారిత్రక వారసత్వ సంపద భవనాన్ని కూల్చవద్దని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దాన్ని కూలకుండా మరమ్మతులు చేసి అందులోనే ఆస్పత్రిని కొనసాగించాలని కోరుతున్నారు. అయితే, కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని కోరే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎప్పుడు కూలుతుందో తెలియని భవనంలో రోగుల, డాక్టర్ల ప్రాణాలను పణంగా పెట్టలేమని వారు వాదిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థిస్తున్నారు.
ఎప్పుడో 1921లో నిర్మించిన భవనమిది. 26.5 ఎకరాల విస్తీర్ణంలో ఆస్పత్రి నిర్మాణం అంటే అప్పట్లో అదో అద్భుతం. ప్రజారోగ్యానికి ప్రభుత్వం ఇచ్చిన విలువకు ఇది నిదర్శనం. దేశంలో అతి ప్రాచీన, అత్యంత విశాలమైన సర్కార్ ఆస్పత్రుల్లో ఇదీ ఒకటి. ఏడాదికి దాదాపు 8 లక్షల మంది ఔట్ పేషెంట్లకు సేవలు అందిస్తుంది. 50 వేల మందికి పైగా ఇన్ పేషెంట్లను చేర్చుకుని వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి ఆస్పత్రి భవనం పూర్తి శిథిలావస్థకు చేరింది. పైకప్పు నుంచి పెచ్చులూడుతున్నాయి. గోడల మధ్య చెట్టు మొలిచాయి. రోజూ అక్కడక్కడా పెళ్లలు రాలి పడుతున్నాయి. ఏ రకంగా చూసినా అందులో ఆస్పత్రిని కొనసాగించడం సరికాదు.
పలు ప్రతిపక్షాలు ఈ భవనం కూల్చి వేతను వ్యతిరేకిస్తున్నాయి. మరమ్మతు చేయాలని కోరుతున్నాయి. ఇంత దారుణంగా శిథిలమైన భవనాన్ని ఎలా మరమ్మతు చేస్తారనేది ప్రశ్న. ఒకవేళ జరగరానికి జరిగి, భవనం కూలిపోయి, అందులోని రోగులు, వైద్యులు కొందరు ప్రాణాలు కోల్పోతే అప్పుడేమంటారు? ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల మీద శ్రద్ధ లేదని, ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఇదే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయవా? ఇన్నిన్ని లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయవా? అంటే, మనిషి ప్రాణానికి విలువ కట్టి పరిహారం ఇస్తే చాలా? మన దేశంలో ప్రాణానికి ఉన్న విలువ ఇంతేనా? అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక పౌరుడి ప్రాణం కాపాడటానికి ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయి. అలాంటిది, కళ్ల ముందు ప్రాణాంతకంగా మారిన భవనాన్ని కూల్చి కొత్తది కడతామంటే ఇంత రాద్ధాంతం ఎందుకు అని కేసీఆర్ సమర్థకులు ప్రశ్న.
రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల వారు, సెలెబ్రిటీలు చాలా మంది ఆ భవనాన్ని కాపాడాలంటున్నారు. తాజాగా దియా మిర్జా, ఆదితీ రావు హైదరీ వంటి అందాల నటీమణులు కూడా ఈ భవనాన్ని కాపాడాలంటూ ప్రకటనలు చేశారు. వీరందరికీ ఒకే ప్రశ్న. వీరు ఒక వారం రోజులు ఆ భవనంలో ఉండగలరా? ఈ ప్రశ్నకు జవాబివ్వాలని, సరే అంటే ఆ భవనంలో ధైర్యంగా ఉండి చూపాలని కొత్త భవనం నిర్మించాలని కోరే వారు డిమాండ్ చేస్తున్నారు. నాయకులు, నటీమణులు దీనికి ఏమంటారో!