తాజా సమాచారం ప్రకారం వచ్చే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను గుంటూరు జిల్లా మంగళగిరిలో గల హాయ్ ల్యాండ్ రిసార్టులో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణకు వీలుగా హాయ్ ల్యాండ్ లో ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు చేయబోతోందని సమాచారం. మరో ఎనిమిదిన్నరేళ్ళు హైదరాబాద్ లో శాసనసభ సమావేశాలు నిర్వహించుకొనే అవకాశం ఉండగా, కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ఒక ప్రైవేట్ రిసార్టులో శాసనసభ సమావేశాలు నిర్వహించాలనుకొంటోందో తెలియదు. అలాగే హాయ్ ల్యాండ్ కి అద్దె చెల్లిస్తునప్పుడు సమావేశాల నిర్వహణకి అవసరమయిన ఏర్పాట్లు చేయడానికి మళ్ళీ అదనంగా రూ.12 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందో తెలియదు.
ఇదివరకు ఒకసారి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి అనువయిన ప్రదేశాలను కనుగొనేందుకు ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సభ్యులు గుంటూరు సమీపంలో గల నాగార్జున విశ్వవిద్యాలయం లేదా విశాఖలోని ఆంద్ర విశ్వవిద్యాలయం అనువుగా ఉన్నాయని ఇదివరకు తేల్చి చెప్పారు. కానీ ఆర్ధిక, భద్రతాపరమయిన కారణాల చేత అక్కడ నిర్వహించడం కష్టమని గత సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహించారు. మరి ఇప్పుడు హాయ్ ల్యాండ్ లో నిర్వహించడానికి ఆ ఇబ్బందులు లేవనుకోవాలా?
ఒకానొక సమయంలో ప్రభుత్వం తాత్కాలిక శాసనసభను నిర్మించాలనే ఆలోచన కూడా చేసింది. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ వృధా చేస్తోందని ప్రజలు, ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదుర్కోవడంతో ఆ ఆలోచనను పక్కను పెట్టింది. కానీ ఇప్పుడు అంతకంటే భారీ వ్యయంతో (రూ. 180 కోట్లు) తో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుకి సిద్దమవుతోంది.
హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నంలో శాసనసభ సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ హాయ్ ల్యాండ్ లో నిర్వహించడానికి సిద్దమవుతోంది. అక్కడ సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం హాయ్ ల్యాండ్ కి ఎంత అద్దె చెల్లించబోతోందో తెలియదు కానీ కేవలం ఏర్పాట్లకే రూ.12 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలుస్తోంది. పోనీ ఇన్ని కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి శాసనసభ సమావేశాలలో ప్రజా సమస్యలపై ఏమయినా చర్చిస్తారా.. అంతే అదీ చేయరు. సమావేశాలు జరిగినన్ని రోజులు అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు దూషించుకోవడం, విమర్శించుకోవడానికే సరిపోతుంది. ఆ మాత్రం దానికి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ఒక ప్రైవేట్ సంస్థకి ఆర్ధిక లబ్ది చేకూర్చే విధంగా ఒక ప్రైవేట్ రిసార్టులో బడ్జెట్ సమావేశాలు ఎందుకు నిర్వహిస్తోంది? అని ప్రజలకి సందేహం కలగడం సహజం. దానికి జవాబు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానిదే! రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోవడం వలననే ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేయగలుగుతోందని చెప్పకతప్పదు.