హైదరాబాద్ లో వున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు వారి కుటుంబాలతో సహా వెంటనే అమరావతికి తరలి రావడానికి రజ్యాంగంలోని 371డి అధికరణం అడ్డుపడుతోంది. ఒక ప్రాంతపు స్ధానిక హక్కులను కాపాడటానికి ఈ ఆర్టికల్ ని రూపొందించారు. దీని ప్రకారం విద్యావకాశాల్లో స్ధానికులకు 85 శాతం స్ధానికేతరులకు 15 శాతం సీట్లు లభిస్తాయి. హైదరాబాద్ లో పని చేస్తున్న దాదాపు 50 వేలమంది ఉద్యోగులు అమరావతికి తరలిరావాలంటే వారి పిల్లలకు’స్ధానికత’ అవరోధమైతుంది. కేవలం 15 శాతం కోటాలో పోటీ పడకతప్పదు. ఇది వత్తిడి పెంచడమే కాక అందరికీ సీట్ల దొరకవు.
1969 లో తెలంగాణా ఉద్యమం, 1972 లో జై ఆంధ్రా ఉద్యమాల తరువాత స్ధానిక, స్ధానికేతర వివాదాలకు పరిష్కారంగా రాజ్యాంగంలో 32 వసవరణగా 371డి ఆర్టికల్ ని 1974 చేర్చారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే వర్తిస్తుంది. ఇపుడు ఆ ఆంధ్రప్రదేశే లేదుకాబట్టి ఉద్యోగుల పిల్లలకు స్ధానిక సమస్య తలెత్తింది కాబట్టి 371డిని పూర్తిగా రద్దు కూడా చేయవచ్చు. అయితే, 371డికి సవరణలు తేవటమన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. దీన్ని సవరించాలన్నా, పూర్తిగా రద్దు చేయాలన్నా అధికారం ఒక్క రాష్ర్టపతికి మాత్రమే ఉంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి సవరణలు చేసి రాష్టప్రతికి పంపవచ్చు లేదా రద్దు చేయాలంటూ కేంద్ర క్యాబినెట్ సిఫారసు కూడా చేయవచ్చు.
371డి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించనున్నది. ఇందులో సవరణలు చేస్తే ఉద్యోగుల పిల్లలు కూడా ఏపిలో స్ధానికులే అవుతారు. ఏది చేయాలన్నా ముందు రాష్ట్రప్రభుత్వం నుండి ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి ఒక సిఫారసు వెళ్ళాలి. అందుకనే, రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి అధ్యక్షతన త్వరలో ఒక కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఈ కమిటీలో సంబంధిత సీనియర్ ఐఎఎస్ అధికారులతో పాటు ఉద్యోగ సంఘ నేతలు కూడా ఉంటారు. కమిటీ ఏర్పాటైన తర్వాత కేంద్రానికి చేయాల్సిన సిఫారసుల గురించి, న్యాయ, పరిపాలనా పరమైన అవసరాలను కూడా చర్చిస్తుంది. అనంతరం, ఒక సిఫారసును ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అది తర్వాత కేంద్ర హోంశాఖకు చేరుతుంది. అక్కడి నుండి కేంద్రమంత్రివర్గానికి వెళ్ళి ఆమోదింపబడితే అక్కడి రాష్ర్టపతికి చేరుతుంది. లాంఛనమే అయినా కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ అయినందున దీని రద్దు లేదా సవరణలకు ఇంత తతంగమూ జరగవలసిందే.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వటానికి కొంత వ్యవధి అనివార్యం. పిల్లల చదువులు వగైరా అన్ని వ్యవహారాలకు 371డి అవరోధమౌతుందని ఉద్యోగసంఘాలు మొదటినుంచీ చెబుతూనే వున్నా ఇందులో వున్న సంక్లిష్టతత ఇపుడే ముఖ్యమంత్రి దృష్టిలోపడింది. మొత్తం ప్రక్రియను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
ఈ మార్పులన్నీ వేగంగాజరిగినా కూడా రకరకాల కోర్సుల మధ్యలో పిల్లలు చదువుతున్న ఉద్యోగ పేరెంట్స్ సమస్యలు వెంటనే తీరవు. కోర్సు మధ్యలో మారడం సమస్యే. హైదరాబాద్ లో వున్నన్ని కోర్సులు, వున్నన్ని సీట్లు రాజధానిప్రాంతమైన గుంటూరు, విజయవాడనగరాల్లో లేకపోవడం పెద్ద ఇబ్బందే. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పై మనహక్కుకి 371డి వ్యతిరేకంగా పరిణమించవచ్చుకాబట్టి పదేళ్ళపాటు దీన్ని కొనసాగించవలసిందే అని ఎవరైనా కోర్టుకెక్కితే అది మరోసమస్యే!
ఏమైనాకూడా ముఖ్యమంత్రీ, చీఫ్ సెకె్రటరీ విజయవాడలో కేంపు ఆఫీసులు పెట్టినంత సుళువుగా హైదరాబాద్ నుంచి ఉద్యోగులు ‘అమరావతి’ తరలిపోవడం సాధ్యపడదని ఆవర్గాలు వివరిస్తున్నాయి. ఇదంతా దశలవారీగా జరగవలసిన వ్యవహారమే.
ఈలోగా ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవహారాలు మందగించకుండా, కుంటుపడకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల ఉద్యోగులను ఉపయోగించుకోవచ్చన్న ఒక సూచన ఎన్ జి ఓ లనుంచే వినిపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లోనూ 60 వేలమంది ప్రభుత్వోగులు వున్నారు. వీరిలో సగం మందిని హైదరాబాద్ నుంచి ఉద్యోగులు వచ్చేవరకూ అమరావతి పరిధిలో ఏర్పాటు చేసే సెక్రటేరియట్ కు డెప్యుటేషన్ మీద పంపవచ్చని ఉద్యోగసంఘాల నాయకులు వివరిస్తున్నారు.